అనాథ, పేద విద్యార్థినులకు నూతన దుస్తుల పంపిణీ: వేమూరి చారిటబుల్ ట్రస్ట్ మానవత్వం
మచిలీపట్నం:
వేమూరి వెంకటసుబ్బయ్య, కుదరవల్లి సీతారామయ్య మరియు వేమూరి వెంకట రమేష్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలోని షార్కీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న పేద, అనాథ విద్యార్థినులకు రూ.40 వేల విలువైన నూతన దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు.
ట్రస్ట్ చైర్మన్ వేమూరి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు, ముఖ్యంగా చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ దఫా గాంధీ విద్యాలయం, మదర్సా స్కూల్, షార్కీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు రూ.40,000 విలువైన దుస్తులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని, నిరుపేద పిల్లలు ఎక్కువగా ఉన్న ఈ హాస్టల్కు నూతన దుస్తులు అందించి సేవలను విస్తరించడం పట్ల పలువురు ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఎస్టీ కులానికి చెందిన ఒక విద్యార్థిని చదువు కోసం అవనిగడ్డ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ తన సొంత జీతం నుంచి డబ్బులు వెచ్చిస్తుండటాన్ని పలువురు ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొక్కా నాంచారయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, న్యాయవాది మాటూరి రాజేష్, నాగేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ధర్మరాజు, వేమూరి రత్నగిరి, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు, హాస్టల్ వార్డెన్ మణి మార్టిన్, కరస్పాండెంట్ మార్టిన్ లూథర్, సింగ్ తదితరులు పాల్గొన్నారు. తమకు నూతన దుస్తులు అందజేసినందుకు హాస్టల్ విద్యార్థినులు వేమూరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

