‘అర్ణబ్’ తుఫాను ముప్పు: కలెక్టర్ డీకే బాలాజి తీవ్ర అప్రమత్తత.. ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యం
మచిలీపట్నం:
అర్ణబ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి కలెక్టర్ డీకే బాలాజి మంగళవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తుపాను తన దిశను మార్చుకుని దక్షిణ దిశగా కదిలే అవకాశం ఉన్నందున అధికారులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణరక్షణే అత్యంత ప్రాధాన్యమని ఆదేశించారు.
సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలింపు
లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, బలహీనమైన కచ్చా ఇళ్లు, రేకుల షెడ్లలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సాయంత్రంలోగా తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని, ఎవరైనా రావడానికి నిరాకరిస్తే పోలీసుల సహకారంతో నచ్చజెప్పి తరలించాలని తెలిపారు. పునరావాస కేంద్రాలుగా కేవలం పటిష్టమైన ఆర్సీసీ భవనాలనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
అన్ని వసతులతో వైద్య శిబిరాలు
పునరావాస కేంద్రాల్లో పరిశుభ్రమైన తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలు పక్కాగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బాలాజి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, అత్యవసర మందులతో పాటు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు.
రాకపోకల నిరోధం – యంత్రాలు సిద్ధం
వరద నీరు ప్రవహించే లోతట్టు రహదారులు, కల్వర్టులు, వాగులను గుర్తించి బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర మార్గాల్లో ప్రయాణించకుండా పోలీసులతో నియంత్రించాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా కూలిపోయే ప్రమాదమున్న హోర్డింగులు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతే తక్షణమే తొలగించేందుకు పవర్ సా యంత్రాలు, జేసీబీలు, సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
చేపట్టే ప్రతి ముందస్తు చర్యను ఫొటోలు, వీడియోలతో డాక్యుమెంటేషన్ చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి కే. శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

