ఓట్ల చోరీతో రాజ్యాంగానికి ముప్పు: ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ
మచిలీపట్నం:
ఏఐసీసీ పిలుపు మేరకు మచిలీపట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ‘పట్టాభి భవన్’ నందు ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏఐసీసీ పరిశీలకులు, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాకలపాటి హరికుమార్ రాజు కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం:
విలేకరుల సమావేశంలో సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ మాట్లాడుతూ భారతదేశంలో ఓట్ల చోరీ యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ముగ్గురూ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పక్షానికి అనుకూలమైన ఓట్లను ఉంచుకుని, ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగించడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, ఎన్నికల కమిషన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2029 లక్ష్యంగా కాంగ్రెస్ పునర్వైభవం:
అనంతరం జిల్లా ఇంచార్జ్ పాకలపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ నూతనంగా పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులు గ్రామ స్థాయిలో విస్తృతంగా పర్యటించి రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ స్థానిక ఎన్నికలను ఒక ముఖ్యమైన సాధనగా భావించి శ్రమించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్, పిసిసి సభ్యురాలు నల్లబోలు కుమారి, నియోజకవర్గ ఇంచార్జ్ వెలిసాలా సుబ్రహ్మణ్యం, మేయర్ అభ్యర్థి రహీఘున్నిసా, స్టేట్ మైనారిటీ సెల్ నాయకులు చిన్న బాజీ, మహమ్మద్ దాదా సాహెబ్, కిసాన్ సెల్ నాయకులు గరికిపాటి శంకర్, ఎస్సీ సెల్ నాయకులు ఎన్. కుమార్, లింగాల సుధాకర్ రావు, జనార్దన్, జెన్యావుల లీల కృష్ణ, అమ్మాజీ, చిలుకోటి ప్రసాద్ వర్మ, రౌతు రాంబాబు, పి. జ్యోతి, జన్ను వెంకటేశ్వరరావు, తమల ఝాన్సీ రాణి తదితర నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

