MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

సెప్టెంబర్‌ 1 నుంచి ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’పై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • August 31, 2026
  • 1 min read
సెప్టెంబర్‌ 1 నుంచి ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’పై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
  • చల్లపల్లిలో భారీ ర్యాలీ, మానవహారంలో పాల్గొన్న కలెక్టర్
  • ప్లాస్టిక్ కవర్లకు స్వస్తి చెప్పి, గుడ్డ సంచులే వాడాలని పిలుపు

చల్లపల్లి:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’ వినియోగంపై నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రజలు, వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన “ప్లాస్టిక్‌ రహిత చల్లపల్లి” ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ

కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్‌ వద్దు.. కాటన్‌ సంచులే ముద్దు” అనే నినాదాలతో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మరియు స్థానికులతో కలసి మానవహారం చేపట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మరియు ప్లాస్టిక్‌ కోటింగ్‌ ఉన్న పేపర్‌ కప్పుల అమ్మకాలు, వినియోగంపై సెప్టెంబర్ 1 నుంచి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని, మైక్రో ప్లాస్టిక్ పర్యావరణానికి మరియు ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి ఒక్కరూ విధిగా గుడ్డ సంచులను (కాటన్ బ్యాగ్స్) ఉపయోగించాలని, టీ మరియు ఇతర పానీయాలకు పునర్వినియోగించగల పాత్రలను వాడాలని విజ్ఞప్తి చేశారు. చల్లపల్లిని ప్లాస్టిక్ రహిత మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, MPDOలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాద్, అవనిగడ్డ డిఎస్పి ఆర్. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN