పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తిరువనంతపురం/మచిలీపట్నం:
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ అనంతపద్మనాభ స్వామివారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కేరళలో ప్రకృతి వైద్య చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు, జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు (మచిలీపట్నం) ఈ పూజలు జరిపించారు.
ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా పేద ప్రజలందరికీ న్యాయం అందించేలా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ శ్రీ అనంతపద్మనాభ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

