MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

వృద్ధులలో మానసిక ప్రశాంతతకు సామాజిక సంబంధాలు ముఖ్యం: డాక్టర్ ప్రభురామ్

  • August 30, 2026
  • 1 min read
వృద్ధులలో మానసిక ప్రశాంతతకు సామాజిక సంబంధాలు ముఖ్యం: డాక్టర్ ప్రభురామ్

 * ఘనంగా ఉదయపు నడక మిత్రమండలి, మహిళా విభాగం సమావేశం

 * హాజరైన ప్రముఖ వైద్య నిపుణులు

మచిలీపట్నం:

ఉదయపు నడక మిత్రమండలి మరియు మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, రామ్ న్యూరో సైకియాట్రిస్ట్ క్లినిక్ అధినేత డాక్టర్ ప్రభురామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులలో వచ్చే మానసిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఆయన విస్తృతంగా వివరించారు.

కుటుంబంతో గడపడం, మితాహారం శ్రేయస్కరం

డాక్టర్ ప్రభురామ్ మాట్లాడుతూ, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ సామాజిక సంబంధాలను పెంపొందించుకోవాలని సూచించారు. వృద్ధులు కనీసం రెండు నెలలకోసారైనా తమ పిల్లలు, మనుమళ్ళతో కలసి సమయం గడపాలని తెలిపారు. ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలని, మితాహారం తీసుకుంటూ మసాలాలు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.

ఉదయం నడక, వేళకు నిద్ర ఆరోగ్యానికి సూత్రాలు

కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బృందావనం శ్రీనివాసాచార్య మాట్లాడుతూ, రోజూ ఉదయాన్నే కొంత దూరమైనా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఐఎంఏ మచిలీపట్నం అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ, రాత్రివేళల్లో త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా లేచే అలవాటు చేసుకోవాలని, టీవీలు మరియు సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఘనంగా సాగిన కార్యక్రమం

నడక మిత్రమండలి అధ్యక్షుడు మురళీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లంకిశెట్టి తాండవ కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు లంకీశెట్టి నీరజ, కార్యదర్శి సిహెచ్. సుజాత, డిప్యూటీ గవర్నర్ కారుమూరి రాజేంద్రప్రసాద్, వేద లక్ష్మీనరసింహం, కె.ఎన్.ఎస్. శివరావు, పెసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN