పమిడిముక్కల రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: P.G.R.S లో జాయింట్ కలెక్టర్కు వినతి
మచిలీపట్నం :
పమిడిముక్కల మండల పరిధిలోని పత్తేలంక గ్రామంలో మసీదు మాన్యానికి సంబంధించిన విలువైన భూములను అక్రమంగా కేటాయించి అవినీతికి పాల్పడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ‘యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ’ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్కు మీకోసం (P.G.R.S) ద్వారా సోమవారం వినతి పత్రం సమర్పించారు.
ఘటన వివరాలు
గౌరవ లోకాయుక్త మరియు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కి పమిడిముక్కల రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వినతి పత్రంలో పేర్కొన్నారు. పత్తేలంక గ్రామంలోని సర్వే నంబర్లు 21, 22, 26 లలోని సుమారు 32.69 ఎకరాల (సెంట్లు) మసీదు మాన్యం భూమిని అధికారుల సహకారంతో 48 మంది రైతుల పేర్లతో ఎల్.పి. నంబర్లు, ఖాతా నంబర్లు కేటాయించి, ఉద్దేశపూర్వకంగా పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా మంజూరు చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఈ ప్రక్రియలో లక్షలాది రూపాయల చేతులు మారాయని, ఆక్రమణదారుల్లో పత్తేలంక మాజీ సర్పంచ్ కుమారుడు కూడా ఉన్నారని ఆరోపించారు.
చర్యలకు డిమాండ్
ఈ అక్రమాలకు కారణమైన పమిడిముక్కల తహశీల్దారు కె. నవీన్ కుమార్, పత్తేలంక వి.ఆర్.ఓలు, సర్వేయర్లు మరియు రీ-సర్వే ప్రత్యేక అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ చేత పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ’ నాయకులు జంపాన శ్రీనివాస గౌడ్, బేతాపూడి జోగేశ్వరరావు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు.

