MachilipatnamLocal News
September 5, 2026
స్పెషల్ స్టోరీ

కుల కార్పొరేషన్లు: పెరిగిన బోర్డులు… కరువైన నిధులు!

  • August 19, 2026
  • 1 min read
కుల కార్పొరేషన్లు: పెరిగిన బోర్డులు… కరువైన నిధులు!

రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. బిసిల ఆర్ధిక వెనుకబాటును తగ్గించడం కోసం 1974లో ఆంధ్రప్రదేశ్ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. తదనంతరం 1982, 1988, 1991, 2009, 2010 లలో 12 కులాల ఆర్థికాభివృద్ధికి  11 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఫిబ్రవరి 2019లో 25 కులాలకు 13 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. 2019కి మొత్తం 26 బీసీ కార్పొరేషన్ లు ఏర్పాటుతో, ఈ 26 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 69 కులాలు ఉన్నాయి. తదనంతరం 2020లో మూడు మైనారిటీ కార్పొరేషన్లతో కలిపి కొత్తగా 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 28 కార్పొరేషన్లలో 52 కులాలు పొందు పరచబడ్డాయి. దాంతో మొత్తంగా 50 కి పైగా బీసీ కార్పొరేషన్లు బీసీల అభివృద్ధికి ఉన్నట్లయింది.

వీటితో పాటుగా ఓసీ ల అభ్యున్నతికి 6 కార్పోరేషన్ లు, ఎస్సీ, ఎస్ టి ల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన కార్పోరేషన్ లతో కలిపి దాదాపు 65 కార్పోరేషన్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి. ఈ కార్పొరేషన్లను అన్నింటినీ  వాటి జనాభా ప్రాతిపదికన ఏ, బి, సి అని మూడు విభాగాలుగా విభజించారు.  పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న  కార్పొరేషన్లను ఏ కేటగిరీ కింద,  లక్ష నుంచి పది లక్షల జనాభా ఉన్న  కార్పొరేషన్లను బి కేటగిరి కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను  సి కేటగిరీ కింద విభజించారు.  

 1975 – 76 ఆర్థిక సంవత్సరం నుంచి 2018 – 2019 వరకు సంవత్సరానికి 21,35,658 మంది బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందితే  2019నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం దాదాపు 70 లక్షల మంది బీసీలు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారు. అలాగే 1975-76 సంవత్సరం నుంచి 2018 – 2019 సంవత్సరం వరకు సంవత్సరానికి  216.62 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు లబ్ధి చేకూరితే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం దాదాపు 7వేల కోట్ల రూపాయలు బీసీలకు లబ్ధి చేకూరింది. 

2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే దాదాపు అన్ని కుల కార్పొరేషన్ లకు చైర్మన్ లను, ఒక్కొక్క కార్పొరేషన్ కు 10 నుంచి 11 మంది డైరెక్టర్ లను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ కు కార్పొరేషన్ వర్గీకరణ(ఏ,బి,సి)ను బట్టి జీతభత్యాలు సుమారుగా లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు. డైరెక్టర్లకు 20వేలు చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ బోర్డులను నియమించి సంవత్సరం దాటుతుంది. దాదాపు 65కు పైగా ఉన్న ఈ కార్పొరేషన్ల బోర్డుల కార్యాలయాలకు  కార్పొరేషన్ల వర్గీకరణ ఆధారంగా ఇద్దరు నుంచి ఐదుగురు సిబ్బంది ఉన్నారు. కార్పొరేషన్ లకు బోర్డు చైర్మన్, డైరెక్టర్ ల జీతభత్యాల రూపేణా కార్యాలయ సిబ్బంది జీతభత్యాల రూపేణా సంవత్సరానికి  కోట్లలో ఖర్చవుతుంది.  

నిధులు శూన్యం

జీతభత్యాలకు సంవత్సరానికి  కోట్లలో ఖర్చుపెడుతున్న ప్రభుత్వం, ఇంత బడ్జెట్ ను ఎందుకు ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని విస్మరించింది. ఎందుకంటే ఈ కుల కార్పొరేషన్ లు ఆయా కులాలకు చెందిన ప్రజల ఆర్ధిక బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేయవలసి ఉంది. కులాల అభివృద్ధికి కృషి చేయాలంటే కార్పొరేషన్ లకు నిధులు విడుదల చేయాలి. కానీ విచిత్రంగా కార్పొరేషన్ల చైర్మన్, బోర్డు డైరెక్టర్ లు, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలకు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం లబ్దిదారులను, వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దాంతో కార్పొరేషన్ల అసలు లక్ష్యం మరుగున పడింది. 

కార్పొరేషన్ల బోర్డులను నియమించి సంవత్సరం దాటినా నిధులు విడుదల చేయకపోవడంతో చైర్మన్ ల మీద  బోర్డు డైరెక్టర్ మీద ఆయా కులాలకు చెందిన లబ్ధిదారుల ఒత్తిడి పెరిగినట్లుగా తెలుస్తుంది. కొంతమంది బోర్డు చైర్మన్లు ప్రభుత్వానికి పలు దఫాలుగా నిధుల విషయంలో విజ్ఞాపనలు అందించినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తునప్పటికీ నిధుల విడుదల అయితే జరగటం లేదు. దాంతో కుల కార్పొరేషన్ ల చైర్మన్, డైరెక్టర్ లలో తీవ్ర నిరాశ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. కార్పొరేషన్ల బోర్డుల పదవీ కాలం రెండు సంవత్సరాలు. నియమించబడ్డ కొన్ని బోర్డుల పదవీ కాలం కూడా చివరి దశకు వస్తుండడంతో, తమ కులానికి ఎటువంటి లబ్ది చేకూర్చకుండానే తమ పదవీ కాలం ముగుస్తుందేమోననే నిస్పృహలో బోర్డు సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

శ్యామ్ కాగిత 

మచిలీపట్నం

About Author

SSN