MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం..

  • August 16, 2026
  • 0 min read
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం..

మచిలీపట్నం:
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని పలువురు బీసీ నాయకులు కొనియాడారు. ఆయన 117వ జయంతి సందర్భంగా ఆదివారం మచిలీపట్నం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, బీసీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గౌడ సంఘ నాయకులు, కూటమి నాయకులు లంకే శేషగిరిరావు, నాగబాబు తదితరులు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, గౌడ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN