MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధి పథంలో కృష్ణా జిల్లా : మంత్రి కొల్లు రవీంద్ర

  • August 15, 2026
  • 1 min read
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధి పథంలో కృష్ణా జిల్లా : మంత్రి కొల్లు రవీంద్ర

రైతులు, బలహీనవర్గాలు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి కొల్లు రవీంద్ర

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు చేపడుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం పోలీసు కవాతు మైదానంలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడుతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు కవాతును పరిశీలించారు.

శాంతికి చిహ్నంగా ఆకాశంలో శాంతికపోతాలు, బెలూన్లు ఎగరవేశారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న పి ఫోర్ మార్గదర్శిలు, మహిళ పారిశ్రామికవేత్తలు, ప్రగతిశీల ఆదర్శ రైతులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు, పోలీసులకు మెడల్స్ అందించి అభినందించారు. అదేవిధంగా వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాటు తిలకించి బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు వెళ్తోందని అన్నారు.

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 2026-27లోనూ గృహ నిర్మాణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తి కోసం అమలు చేస్తున్న పథకాలు, భద్రత, రక్షణకు తీసుకుంటున్న కఠిన చర్యలను పునరుద్ఘాటించారు.

విద్యారంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఇతర విద్యా సహాయ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించి దేశ, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని మంత్రి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కే సాంబశివరావు, జి బాలసుబ్రమణ్యం, ఎస్ కరుణ కుమారి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author

SSN