స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మచిలీపట్నం:
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో ఆహుతుల్లో దేశభక్తి భావాన్ని, దేశ సమగ్రతను పెంపొందించేలా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
నగరంలోని కాలేఖాన్ పేటకు చెందిన జీవీఎన్ఆర్ ఎంపీఎల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సునో సునో దునియా వాలో.. గీతానికి, ఈకే బాలభాను ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మన ఇండియా.., శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రాంతివీర్ వందేమాతరం.., నిర్మల హై స్కూల్ విద్యార్థులు దేశమంటే.., చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైరా నరసింహారెడ్డి చిత్రంలోని దేశభక్తి గీతం.., సెయింట్ జాన్స్ హై స్కూల్ వందేమాతరం.. వంటి దేశభక్తి ప్రబోధాత్మక గీతాలకు నర్తించి ఆహుతుల్లో స్ఫూర్తిని నింపారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సెయింట్ జాన్స్ హై స్కూల్ మొదటి బహుమతి పొందగా, చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ, నిర్మల హై స్కూల్ తృతీయ బహుమతులను పొందాయి. వారికి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ప్రదర్శనలో పాల్గొన్న మిగిలిన పాఠశాలలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు.


