ఘన వ్యర్థాల నిర్వహణలో బల్క్ వేస్ట్ జనరేటర్లు బాధ్యత వహించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు
తాడిగడప:
ఘన వ్యర్థాల నిర్వహణ విషయంలో బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ ప్రాంగణాల్లోనే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు. సోమవారం తాడిగడప మున్సిపాలిటీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఘన వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం పరిశుభ్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లోని కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, నిబంధనలు పాటించకుండా ఆదేశాలను ఉల్లంఘించే బల్క్ వేస్ట్ జనరేటర్లపై అవసరమైన సందర్భాల్లో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసే స్థాయిలో చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. అందువల్ల నిబంధనలు పాటించని బల్క్ వేస్ట్ జనరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా, ముందుగా వారికి సరైన అవగాహన కల్పించి, తమ ప్రాంగణాల్లోనే తడి వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
తడి వ్యర్థాలను ప్రాంగణంలోనే ప్రాసెస్ చేయాలి
బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ ప్రాంగణాల్లోనే తడి వ్యర్థాల నిర్వహణకు తగిన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తడి వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం ద్వారా సేంద్రీయ ఎరువు (కంపోస్ట్) తయారు చేసుకోవచ్చని, దానిని ఆయా ప్రాంగణాల్లో మొక్కలు, తోటల పెంపకానికి వినియోగించుకోవచ్చని తెలిపారు.
దీంతో ఒకవైపు సంస్థలకు ఉపయోగకరమైన కంపోస్ట్ లభించడంతో పాటు, మరోవైపు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సంస్థలపై పడే వ్యర్థాల నిర్వహణ భారం తగ్గుతుందని చెప్పారు. స్థానిక సంస్థలు తమ వనరులను ఇతర పరిశుభ్రత కార్యక్రమాలపై వినియోగించి గ్రామాలు, పట్టణాలను మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. “మీ ప్రాంగణాల్లోనే తడి వ్యర్థాలను నిర్వహించండి. ఇది ప్రభుత్వానికి చేసే సహాయం మాత్రమే కాదు.. మీ సంస్థకు, మీ ప్రాంగణానికి, సమాజానికి కూడా మేలు చేస్తుంది” అని కలెక్టర్ పేర్కొన్నారు.
బల్క్ వేస్ట్ జనరేటర్లకు 15–20 రోజుల గడువు
ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్‌కు నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను స్పష్టంగా వివరిస్తూ వివరణాత్మక నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ ప్రాంగణాల్లో వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు 15 నుంచి 20 రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. ఈ గడువు అనంతరం కూడా నిబంధనలు పాటించని సంస్థలపై తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేతతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అవగాహనతో ప్రారంభించి, అవసరమైతే కఠిన అమలు
గతంలో నిబంధనలు ఉన్నప్పటికీ బల్క్ వేస్ట్ జనరేటర్లపై తగిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోయామని, అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికలు, అఫిడవిట్‌లు సమర్పించాల్సిన పరిస్థితి ఉన్నందున ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, వాటి స్ఫూర్తితో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
గ్రీన్ రిచ్ సంస్థ ద్వారా ప్రాక్టికల్ డెమో
బల్క్ వేస్ట్ జనరేటర్లకు తమ ప్రాంగణాల్లో తడి వ్యర్థాలను నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిష్కారాలపై అవగాహన కల్పించేందుకు చెన్నైకి చెందిన గ్రీన్ రిచ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తడి వ్యర్థాలను ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువుగా మార్చే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడంతో పాటు, ప్రత్యక్షంగా ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. అయితే ఏ సంస్థకు చెందిన సాంకేతిక పరిష్కారాన్ని వినియోగించుకోవాలనే విషయంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని, సదుపాయం ఏర్పాటు చేసి నిబంధనలు పాటించడం మాత్రం తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా సమన్వయంతో చర్యలు
ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో కూడా కీలక భాగమని కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తమ పరిధిలోని బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి, వారి నమోదు, వ్యర్థాల వేర్పాటు, తడి వ్యర్థాల ప్రాసెసింగ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, కృష్ణా జిల్లాను స్వచ్ఛమైన, పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం ధనలక్ష్మి, గుడివాడ, తాడిగడప, మచిలీపట్నం, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు మనోహర్ రావు, నజీర్, బాపిరాజు, సుభాష్ చంద్రబోస్, డివిజనల్ అధికారులు రామనాథం, సునీత శర్మ, స్వర్ణలత, డిఎల్పిఓ లు మహమ్మద్ రజావుల్లా, సంపత్ కుమారి, కృష్ణా జిల్లాలోని 25 మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, బల్క్ వేస్ట్ జనరేటర్ల ప్రతినిధులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

