MachilipatnamLocal News
September 5, 2026
ఫీచర్స్

యర్రమాద వెంకన్న నేత ఉద్యమ ఫలితమే చేనేత దినోత్సవం

  • August 7, 2026
  • 1 min read
యర్రమాద వెంకన్న నేత ఉద్యమ ఫలితమే చేనేత దినోత్సవం

చేనేత కళాకారుల ఆత్మగౌరవం, సాంప్రదాయ చేనేత కళా పరిరక్షణ కోసం, చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం ఒక రోజు ఉండాలని అకుంఠిత దీక్షతో ఎన్నో ఉద్యమాలు చేశారు హైదరాబాద్ కు చెందిన యర్రమాద వెంకన్న నేత. 2006 నుంచి అలుపెరగని సంకల్పంతో ఆయన చేసిన ఉద్యమం ఫలితంగా 2017లో భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.

చెన్నై వేదికగా జరిగిన తొలి జాతీయ దినోత్సవం ఆవిర్భావ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేయగా యర్రమాద వెంకన్న కూడా పాల్గొన్నారు. నాటి సభలో మోడీ ప్రసంగం చారిత్రాత్మకం. చేనేత పట్ల ఆయనకు ఉన్న అభిమానం, అవగాహన అమోఘం. నాటి ఆయన ప్రసంగం వల్ల చేనేత కళాకారుల వృత్తి నైపుణ్యం పట్ల గౌరవం పెరిగింది. నాటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నేతన్నలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకునిగా యర్రమాద వెంకన్న హైదరాబాదులోని కంట్రీ క్లబ్ లో జాతీయ చేనేత దినోత్సవ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చేనేత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు పాల్గొని ప్రసంగించారు. చేనేత ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, నేతన్నుల కళాత్మక ఉత్పత్తుల శ్రమ చుక్కల కష్టాన్ని వివరించి, ఇంతటి గొప్ప ‘కళ’ను ప్రపంచస్థాయిలో విస్తృతం చేయాలని, అందుకు ప్రభుత్వాలు సత్సంకల్పంతో ముందుకు రావాలని కోరారు.

ఆ సమావేశంలో యర్రమాద వెంకన్న మాట్లాడుతూ దేశంలోని 67 శాతం మంది చేనేత కళాకారులు 5వేల రూపాయల ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ చేనేత ఉత్పత్తి 80 శాతం పైగా భారతదేశం నుండి అందుతుందని అన్నారు. దేశంలో 28 లక్షల చేతి మగ్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి పైగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి రంగాన్ని ప్రోత్సహించవలసిన ప్రభుత్వాలు చేనేతకు చెందిన పలు పథకాలను రద్దుచేసి నేతన్నలకు తీరని అన్యాయం చేసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్టులో 200 కోట్లు కేటాయించింది. చేనేత రంగాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించవలసిన కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్స్ తో సమానంగా జీఎస్టీ విధించి చేనేత చేతి పరిశ్రమను నిర్వీర్యం చేసిందన్నారు. మిల్లులో తయారైన వస్త్రాలను చేనేత వస్త్రాలుగా అమ్మి నేతన్నలకు తీరని ద్రోహం తలపెడుతున్నా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకపోయిందని, ఇలా చేయడం దారుణమని మాదన్న అన్నారు.

చేనేత ఉద్యమకారురాలు, ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో చేనేతను నిలబెట్టడానికి కేంద్రం చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కళాత్మకమైన చేనేత గొప్పతనాన్ని మాటలతో కాకుండా అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. ఇప్పటికే చేనేత ఉత్పత్తులపై ప్రపంచ దేశాల్లో ఆదరణ పెరుగుతోందని దీన్ని అందిపుచ్చుకుని కేంద్రం తగిన విధంగా ప్రణాళికలతో ముందుకెళితే నేతన్నల బతుకుల్లో కాంతిరేఖలు వెల్లువెరుస్తాయని పూనమ్ కౌర్ అన్నారు.

కంట్రీ క్లబ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా చేనేతను ధరిస్తున్నారని అన్నారు. చేనేత కళాకారుల కోసం పనిచేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. రచయిత్రి, చేనేత ప్రేమికురాలు అంజు పొద్దార్ మాట్లాడుతూ భారతీయ చేనేత కళాకారుల కళ గొప్పదని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ చేనేత కళాకారుల ఉత్పత్తులను తాను అమితంగా ప్రేమిస్తానని అన్నారు. విదేశాల్లో ఉన్న తన మనవరాలుకు చేనేత పట్ల మక్కువ ఎక్కువని చేనేత దుస్తులనే ధరిస్తుందని వివరించారు. యువతలో చేనేత పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సమావేశంలో చేనేత పెద్దలు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సి.ఎస్. రంగరాజన్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, చింతకింది మల్లేశం, పల్లె సృజన చైర్మన్ బిగ్రేడియర్ పి గణేశం, క్రాఫ్ట్ కౌన్సిల్ పూర్వ చైర్పర్సన్ విజయలక్ష్మి, అభిహర సీఈవో సుధా ముల్లపూడి, కౌమది స్టూడియో వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ షర్మిల నాగరాజు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ చిలువేరు కాశీనాథ్ తో పాటు ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొని చేనేత గొప్పతనాన్ని వివరించి, ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.

నందం రామారావు
9393921025

About Author

SSN