MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

కోటి 43 లక్షలు కాజేసిన కేటుగాళ్లు…డిజిటల్ అరెస్టు ఉచ్చులో వృద్ధురాలు..

  • August 6, 2026
  • 1 min read
కోటి 43 లక్షలు కాజేసిన కేటుగాళ్లు…డిజిటల్ అరెస్టు ఉచ్చులో వృద్ధురాలు..

మచిలీపట్నం:

“మీ మొబైల్ నంబర్ ను దేశంలోనే అతిపెద్ద సైబర్ నేరంలో ఉపయోగించారు. మీరు ప్రస్తుతం డిజిటల్ అరెస్టులో ఉన్నారు. ఇంటి బయటకు వస్తే ప్రాణాలకు ప్రమాదం.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తారు…” అంటూ సైబర్ కేటుగాళ్లు చేసిన బెదిరింపులను నిజమని నమ్మిన ఓ వృద్ధురాలు ఏకంగా కోటి 43 లక్షల 53 వేల రూపాయలు కోల్పోయిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం నగరంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సైబర్ మోసాల్లో ఇది ఒకటి.

సేకరించిన సమాచారం ప్రకారం మచిలీపట్నం పరాసుపేటకు చెందిన వెంపటి అలివేలు మంగకు తొలుత టెలికమ్యూనికేషన్ విభాగం అధికారులమంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఆమె మొబైల్ నంబర్ భారీ సైబర్ నేరంలో ఉపయోగించబడిందని, వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పారు. అనంతరం తాము ఢిల్లీ పోలీసులమని పరిచయం చేసుకున్న మరో ముఠా సభ్యులు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు.

తాను స్థానిక పోలీసులను ఆశ్రయిస్తానని అలివేలు మంగ చెప్పగా, ఇది దేశవ్యాప్తంగా వెలుగుచూసిన అత్యంత పెద్ద సైబర్ స్కామ్ అని, ఈ కేసులో ఇప్పటికే పలువురిని దుండగులు చంపేశారని, మీ పేరు కూడా నిందితుల జాబితాలో ఉందని భయపెట్టారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు, బంధువులకు లేదా ఇతరులకు చెబితే మీ ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. దీంతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది.

ఇంతటితో ఆగకుండా, ఇంటి బయట గుర్తుతెలియని వ్యక్తులు మీపై నిఘా ఉంచారని, గడప దాటితే వెంటనే దాడి చేస్తారని నమ్మించి ఆమెను పూర్తిగా తమ నియంత్రణలో ఉంచారు. జూలై 20 నుంచి ఆమెను ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఆమె నిరపరాధి అని కోర్టులో నిరూపించుకోవాలంటే, ముందుగా తన పేరిట ఉన్న మొత్తం నగదును కోర్టు ధ్రువీకరణ కోసం తాత్కాలికంగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని నమ్మించారు. అనంతరం ఆమెకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని, మూడు జాతీయ బ్యాంకుల్లో ఉన్న మొత్తం నగదును తాము సూచించిన ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. అది నిజమేనని నమ్మిన అలివేలు మంగ మూడు విడతల్లో రూ.1,43,53,000ను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసింది.

ఇదే సమయంలో, ఆమె భర్త వెంపటి వెంకటేశ్వరరావు వృద్ధాప్యంతో మంచానికే పరిమితమై ఉండటంతో పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించే అవకాశం లేకపోయింది. ఆయన జిల్లా ఇంజినీరింగ్ విభాగంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి.

అయితే అంత భారీ మొత్తం కాజేసినప్పటికీ సైబర్ ముఠా ఆశ ఆగలేదు. తన వద్ద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చి పంపాలని మరింత ఒత్తిడి తెచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అలివేలు మంగ అమెరికాలో ఉన్న కుమారుడికి విషయం వివరించింది. జరిగిన తీరును విన్న కుమారుడు అది సైబర్ మోసమని గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించాడు.

దీంతో అలివేలు మంగ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు ఏయే ఖాతాలకు వెళ్లింది, ముఠా ఎక్కడి నుంచి వ్యవహరించింది అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’, ‘సీబీఐ’, ‘ఢిల్లీ పోలీసులు’, ‘టెలికాం శాఖ’ లేదా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు బదిలీ చేయమని ఎప్పుడూ ఆదేశించవని, అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు సమాచారం ఇవ్వడం లేదా సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

About Author

SSN