పారిశ్రామికవేత్తలు పోస్టల్ ఎగుమతి సేవలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
జెండా ఊపి పోస్టల్ పార్సిల్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం:
ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర తపాల శాఖ అందిస్తున్న పోస్టల్ ఎగుమతి సేవలు పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో తపాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తలకు పోస్టల్ ఎగుమతి సదుపాయాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం పోస్టల్ పార్సిల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులను పెంచే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. దేశీయ మార్కెట్‌లో వ్యాపారం చేయడం ఒక విధమైన సవాలైతే, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. విదేశీ మార్కెట్లు, అక్కడి నిబంధనలు, రవాణా విధానాలపై అవగాహన లేకపోవడం, అధిక లాజిస్టిక్స్ వ్యయం, వేగవంతమైన డెలివరీ అవసరం వంటి అంశాలు ఎగుమతిదారులకు ప్రధాన సవాళ్లుగా ఉంటాయని వివరించారు.
అలాంటి పరిస్థితుల్లో భారత తపాల శాఖ అందిస్తున్న పోస్టల్ ఎగుమతి సేవలు ఎగుమతిదారులకు విశ్వసనీయమైన, సురక్షితమైన, తక్కువ వ్యయంతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటి వద్ద లేదా వ్యాపార సంస్థ వద్ద నుంచే పార్సిళ్లను సేకరించి విదేశాలకు సురక్షితంగా పంపించే సౌకర్యం, ప్రభుత్వ సంస్థ అందించే విశ్వసనీయ సేవలు, తక్కువ రవాణా వ్యయం వంటి అనేక ప్రయోజనాలు ఈ సేవల్లో ఉన్నాయని చెప్పారు.
ఈ సేవల గురించి ఇంకా చాలా మంది పారిశ్రామికవేత్తలకు పూర్తి అవగాహన లేదని, అందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమాచారం ప్రతి ఎగుమతిదారునికీ చేరేలా పారిశ్రామికవేత్తలు తమ వాట్సాప్ గ్రూపులు, వ్యాపార వర్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కువ మంది ఈ సేవలను వినియోగించుకోవడం వల్ల ఎగుమతిదారులకు లాభం కలగడమే కాకుండా దేశ ఎగుమతుల వృద్ధికి కూడా తోడ్పాటునిస్తుందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పిజిఆర్ఎస్ సమావేశపు వెలుపల పోస్టల్ పార్సిల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, తపాల శాఖ చేపడుతున్న ఆధునిక సేవలను అభినందించారు. కార్యక్రమంలో తపాల శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, అదనపు సూపరింటెండెంట్ శర్మ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

