MachilipatnamLocal News
July 21, 2026
జిల్లా

బాలల చట్టాలు, భద్రతపై జిల్లా స్థాయి ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహణ

  • July 21, 2026
  • 1 min read
[addtoany]
బాలల చట్టాలు, భద్రతపై జిల్లా స్థాయి ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహణ

మచిలీపట్నం:

బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, చట్టాల అమలుపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని విజయశ్రీ కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం ఒకరోజు జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్. వరలక్ష్మి మాట్లాడుతూ పోక్సో చట్టం–2012 మరియు జువెనైల్ జస్టిస్ (JJ) చట్టం–2015 నిబంధనలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. బాలలపై జరిగే నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) చైర్‌పర్సన్ శ్రీమతి సువార్త జువెనైల్ జస్టిస్ చట్టం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విధులు, బాలల సంరక్షణ వ్యవస్థపై సమగ్రంగా వివరించారు. అదనపు ఎస్పీ శ్రీ వి.వి. నాయుడు మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రసంగిస్తూ, విద్యార్థులను మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్క్‌ షాప్‌లో విద్యాహక్కు చట్టం–2009 (Right to Education Act), బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 (Prohibition of Child Marriage Act), పోక్సో చట్టం–2012, జువెనైల్ జస్టిస్ చట్టం–2015, అలాగే పాఠశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్లు తమ సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

కార్యక్రమంలో సామాజిక సంక్షేమ శాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి సీతామహాలక్ష్మి, సీఐ వెంకటేశ్వరరావు, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రసన్న విశ్వనాథ్, బంటుమిల్లి సీడీపీఓ శ్రీమతి సముద్రవేణి తదితరులు పాల్గొని బాలల సంక్షేమంపై తమ సందేశాలను అందించారు. ఈ వర్క్‌షాప్‌లో సీడీపీఓలు, సూపర్వైజర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

SSN