MachilipatnamLocal News
July 21, 2026
జిల్లా

విజయానికి పాఠ్యపుస్తకాలే బలమైన పునాది: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • July 20, 2026
  • 1 min read
[addtoany]
విజయానికి పాఠ్యపుస్తకాలే బలమైన పునాది: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

ఇతరులతో పోల్చుకోవద్దు..

‘షైనింగ్ స్టార్స్–2026’లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాల ప్రదానం

మచిలీపట్నం:

విద్యార్థులు పాఠ్యపుస్తకాలను లోతుగా చదివే అలవాటు పెంపొందించుకోవాలని, నోట్స్‌పై మాత్రమే ఆధారపడకుండా స్వయంగా చదివి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులకు ఉద్బోధించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్–2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, విలువైన పుస్తకాలను అందజేసి అభినందించారు.

కృష్ణా జిల్లాలో ఈ ఏడాది మొత్తం 217 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్‌గా ఎంపికయ్యారు. వీరిలో పదో తరగతికి చెందిన 168 మంది, ఇంటర్మీడియట్‌కు చెందిన 49 మంది ఉన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం రూ.43.40 లక్షలు ప్రోత్సాహకంగా పంపిణీ చేశారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివిన తన విద్యార్థి దశ అనుభవాలను పంచుకున్నారు. పాఠ్యపుస్తకాలను స్వయంగా చదివి అర్థం చేసుకునే అలవాటు తన విజయానికి బలమైన పునాది అయిందన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం విజయానికి కీలకమని చెప్పారు. మార్కుల కంటే నేర్చుకునే సామర్థ్యం ముఖ్యమని, ఇతరులతో పోల్చుకుంటూ అనవసర ఒత్తిడికి గురికాకుండా, నిన్నటి తనకంటే ఈరోజు మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు బహుమతి అందించడం ద్వారా వారి ప్రతిభకు గౌరవం లభిస్తుందని అన్నారు. ఇలాంటి గుర్తింపు విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తుందన్నారు. ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో పాటు, ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణగా నిలిచి మరింత కష్టపడి చదివేలా చేస్తాయని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలుగు భాషను నేర్చుకుని ప్రజలతో మమేకమవుతూ విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడిన కొనకళ్ల నారాయణరావు, పాఠశాలల సందర్శనల ద్వారా విద్యా ప్రమాణాల మెరుగుదలకు కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో డీఈవో యు వి సుబ్బారావు, డిఐఈఓ సరళ, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, రాష్ట్ర గిడ్డంగుల నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, డిప్యూటీ డీఈవోలు శేఖర్ సింగ్, పద్మారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN