మీ కోసం కు 147 ప్రజల అర్జీలు, 6 ఉద్యోగుల అర్జీలు
మచిలీపట్నం:
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, శిక్షణలో ఉన్న కలెక్టర్ అగర్వాల్, ఇంచార్జి డిఆర్ఓ పోతురాజు, అవనిగడ్డ డి.ఎస్.పి అభిషేక్ లతో కలిసి తొలుత ఉద్యోగుల నుండి 6 అర్జీలు స్వీకరించారు. అనంతరం మీకోసం… ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి 147 అర్జీలు స్వీకరించారు.
అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి
మచిలీపట్నం నగరం చిలకలపూడికి చెందిన తోట శ్యామలాదేవి తాను నివసిస్తున్న 7 వ డివిజన్ పుల్ల వారి వీధి నందు సుమారు 8 అడుగులలో ప్రభుత్వ రహదారి, మురుగు కాలువ,విద్యుత్ స్తంభాలు ఉన్నాయన్నారు. వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం ప్రజలందరికీ వీలుగా రహదారి సుమారు 20 అడుగులకు పెంచి సమస్య పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామ కాపురస్తులు నత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో 1400 మంది ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, ఒక్క మురికి కాలువ కూడా సరిగా లేదని, మురికి కాలువల్లో పూడికలు తీయించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు
జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ సైకం భాస్కరరావు మాట్లాడుతూ దోమల నివారణకు ఆమోదం పొందని చాలా విషతుల్యమైన రసాయన పదార్థాలతో తయారైన వివిధ రకాల ఊది బత్తీలు మార్కెట్లో లభిస్తున్నాయని వాటి పొగ వలన ఆస్తమా వంటి ఊపిరితిత్తులు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఫిర్యాదు చేస్తూ వాటి తయారీదారులు, వ్యాపారస్తులు పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేస్తూ అర్జీ అందజేశారు.
మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామం నివాసి గుంజ ముత్తమ్మ తనకు మూత్రపిండాల వ్యాధి వలన నాలుగు నెలల నుండి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నారని, పింఛను కొరకు దరఖాస్తు చేశామని, ఇల్లు గడుపుటకు చాలా కష్టంగా ఉందని తెలియజేస్తూ పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు
బహుజన సమాజ్ పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జిలు ఎస్ బాలాజీ, బోసు బాబులు అర్జీ అందజేస్తూ డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను క్యాటగిరి వారిగా కట్ ఆఫ్ మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామపంచాయతీలో 2011 సంవత్సరంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ స్వయంగా విచారణ జరిపి పంచాయతీలో 17 అనధికార లేఔట్ల యజమానులు 10 శాతం కామన్ సైట్ గండిగుంట గ్రామపంచాయతీకి ఇవ్వనందున మూడు కోట్ల 18 లక్షల 95600 రూపాయలను అనధికార లేఔట్ల యాజమానులు చెల్లించాలని 2011లో ఉత్తర్వులు జారీ చేస్తూ ఆ మొత్తం వసూలు చేయాలని అప్పటి జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్యకు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు వసూలు చేయనందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆర్టిఐ ఆక్టివిటీ సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్ మరికొంతమంది ఫిర్యాదు అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి.డి. హరిహరనాథ్ డిపిఓ ధనలక్ష్మి, ఐసిడిఎస్ పిడి ఎం ఎన్ రాణి, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి మణి, ఆర్డబ్ల్యూఎస్. ఎస్. ఈ. సోమశేఖర్, డి.ఎస్.ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధిపతి వెంకటరావు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

