జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధ్యక్షతన కృష్ణా జిల్లాలో జూన్ 28, 2026న నిర్వహించనున్న పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె. ప్రేమ్ చంద్ మరియు వివిధ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలియో రహిత సమాజం సాధించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని తెలిపారు. జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పోలియో బూత్‌ల ఏర్పాటు, వ్యాక్సిన్ నిల్వ మరియు రవాణా, మైక్రో ప్లానింగ్, ఇంటింటి సర్వేలు, వలస కుటుంబాల గుర్తింపు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ మాట్లాడుతూ, పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఇతర ఆరోగ్య సిబ్బందితో సమన్వయంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారికి పోలియో చుక్కలు అందేలా మైక్రో ప్లానింగ్ రూపొందించి, బూత్‌ల ఏర్పాటు, వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్ చైన్ నిర్వహణ, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన పిల్లలను గుర్తించి ఇంటింటి సందర్శనల ద్వారా వారికి కూడా పోలియో చుక్కలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఆరోగ్య శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)తో పాటు అన్ని అనుబంధ శాఖలు సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు.

