MachilipatnamLocal News
June 24, 2026
జిల్లా

యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • June 21, 2026
  • 1 min read
[addtoany]
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

జిల్లా స్థాయి యోగా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడు బోడె ప్రసాద్ తదితర ప్రజా ప్రతినిధులు

ఉయ్యూరు:

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఆదివారం ఉదయం ఉయ్యూరులోని ఏజీఎస్జీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

విద్యార్థులు సౌకర్యవంతంగా యోగాసనాలు వేసేందుకు వీలుగా అధికారులు కళాశాల మైదానంలో తివాచీలు ఏర్పాటు చేశారు. మైదానంలో భారతదేశ రేఖా చిత్రంతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేసి అదే ఆకృతిలో విద్యార్థులను కూర్చోబెట్టి యోగాసనాలు వేయించటం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వేదిక నుండి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి, మద్దాల చింతయ్య, శేష ప్రసన్న సూచనలు చేస్తూ వారి చేత యోగాసనాలు వేయించి అందరి చేత యోగ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, ఇతర పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాగి జావా, తాగునీరు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లను పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే మానసిక చురుకుదనం, ఏకాగ్రత గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల చదువుపై దృష్టి పెరగడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు.

ప్రతిరోజూ ఒక గంట సమయం యోగాకు కేటాయిస్తే మిగతా రోజు మొత్తం మరింత ఉత్సాహంగా మారుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా అత్యుత్తమ సాధనమని, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను యోగా ద్వారా నివారించవచ్చని చెప్పారు. విద్యార్థులందరూ ఇప్పటి నుంచే యోగా సాధన ప్రారంభించి జీవితంలో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా యోగాను తమ పాఠ్య ప్రణాళికలో భాగంగా చేర్చి ప్రతిరోజూ విద్యార్థులతో సాధన చేయించాలని సూచించారు. ప్రారంభంలో విద్యార్థులకు కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ, క్రమం తప్పకుండా యోగా చేస్తే దాని ప్రయోజనాలు వారికి స్పష్టంగా తెలుస్తాయని తెలిపారు. యోగా సాధన వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, విద్యా ప్రతిభ పెరుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో ఎస్ కరుణ కుమారి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరప్రసాద్, విశ్వశాంతి అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ రుద్రకుమారి, ఆయుష్ శాఖ అధికారి యోగ సమన్వయకర్త డాక్టర్ వాహిని, పర్యాటక శాఖ అధికారి రామ్ లక్ష్మణరావు, డిప్యూటీ డీఈవో పద్మారాణి, యోగ శిక్షకులు నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN