ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇంచార్జ్ డిఆర్ఓ పి పోతురాజు, డీఎస్పీ జి. శ్రీనివాసరావుతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు.
అర్జీలలో కొన్ని:
- ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, స్టేషనరీ వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని, ఈ వ్యవహారంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కృష్ణా జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అలాగే జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని, సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం, ఫిట్నెస్ లేని బస్సులు నడపడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు బి. పూజిత, జిల్లా కార్యదర్శి ఎస్. సమరం తదితరులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
- ప్రభుత్వం 2005లో తన పేరున మంజూరు చేసిన డి-పట్టా ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త దుర్వ్యసనాలకు అలవాటు పడి ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన వేముల తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తన పేరున ఉన్న డి-పట్టా నివేశన స్థలానికి సంబంధించిన ఇంటిపన్ను తన పేరుకు మార్చి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
- రంగన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శింగన్నగూడెం, రంగన్నగూడెం చెరువులను మూడు సంవత్సరాల కాలానికి పబ్లిక్ టెండర్ ద్వారా పాటపాడుకున్నట్లు బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన బొకినాల సాంబశివరావు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చెరువుల లీజుకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులకు పలుమార్లు నగదు చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు రశీదులు ఇవ్వలేదని తెలిపారు. లీజు కాలం డిసెంబర్ 2026 వరకు ఉండగా, కొంతమంది అధికారులు తనకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువులో సుమారు రూ.10 లక్షల విలువైన చేపలు ఉన్నందున తనకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డిపిఓ ధనలక్ష్మి, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ రమణరావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డ్వామా, డీఆర్డిఏ పీడీలు ఎన్ శివప్రసాద్ యాదవ్, హరిహరనాథ్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, మత్స్య, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు అయ్యా నాగరాజా, జ్యోతి రమణి, జే జ్యోతి, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డిఎస్‌ఒ జి మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, హౌసింగ్ పీడీ వెంకట్రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

