“స్టాప్ డయేరియా క్యాంపెయిన్ – 2026” జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో “స్టాప్ డయేరియా క్యాంపెయిన్ (SDC) – 2026” కార్యక్రమం అమలుకు సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా కారణంగా సంభవించే నివారించగల మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.
జూన్ 16 నుండి జూలై 31, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఐదేళ్లలోపు చిన్నారి కుటుంబానికి ఆశా కార్యకర్తల ద్వారా ORS ప్యాకెట్లు మరియు జింక్ మాత్రలను పంపిణీ చేయడం, అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో ORS-జింక్ కార్నర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీటి వినియోగం, పారిశుధ్య చర్యలు మరియు డయేరియా నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ మాట్లాడుతూ, జిల్లాలో ORS మరియు జింక్ మాత్రల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఫీల్డ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. పట్టణ మురికివాడలు, వలస కార్మికుల నివాస ప్రాంతాలు మరియు చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. ప్రజలందరూ పరిశుభ్రత పాటిస్తూ, డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే ORS మరియు జింక్ వినియోగించడంతో పాటు సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, జిల్లా కార్యక్రమ అధికారులు, వైద్య అధికారులు, పర్యవేక్షణ సిబ్బంది మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

