స్వదేశీ దర్శన్ పథకం కింద మంగినపూడి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
మచిలీపట్నం:
మంగినపూడి బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఉయ్యూరు మండలంలో పర్యటించి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డిఓ కరుణకుమారితో కలిసి పర్యాటకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ పథకం కింద మంగినపూడిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకోసం మంగినపూడి బీచ్ పరిధిలో 100 ఎకరాల్లో పర్యాటక ప్రాంత అభివృద్ధికి అవసరమైన షాపింగ్ దుకాణాల సముదాయం, సమాచార కేంద్రం, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే తయారుచేసి అందజేయాలన్నారు. మంగినపూడి బీచ్, డచ్ సిమెట్రీ, బందరు కోట, నాగాయలంక శ్రీ రామ పాదక్షేత్రము, ఘంటసాల బౌద్ధ క్షేత్రము తదితర ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్ గా మలిచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు.
అలాగే గన్నవరం లో విమానాశ్రయానికి ఎదురుగా ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్టు నివేదికను కూడా సిద్ధం చేయాలన్నారు. ఒకసారి ఆయా ప్రాంతాలను సందర్శించి సాధ్యసాధ్యాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటకశాఖ ఎస్ ఈ ఈశ్వరయ్య , పట్టణ ప్రణాళిక అధికారులు సాజిత్, శివశరణ్ పాల్గొన్నారు.

