MachilipatnamLocal News
June 15, 2026
జిల్లా

జిల్లాలో రైతులకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • June 15, 2026
  • 0 min read
[addtoany]
జిల్లాలో రైతులకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా అందరికీ యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ తోట్లవల్లూరు మండలంలో పర్యటించి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కొత్తగా రైతులకు ఎఫ్ ఎఫ్ ఎస్ రైతు యాప్ ద్వారా ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కృష్ణాజిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఎఫ్ ఎఫ్ ఎస్ రైతు యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని సూచించిందన్నారు. ఆ సూచనల మేరకు ఏపీ ఎఫ్ ఆర్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులందరూ ఈ యాప్ కు అలవాటు పడాలని అందుకు కొంత సమయం పడుతుందని అంతవరకు రైతులందరూ కొంత ఓపిక పట్టాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తామన్నారు. ఈ సీజన్ తో పాటు వచ్చే సీజన్ కు కూడా యూరియాను ఇప్పుడే కొనుగోలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. యూరియా దొరుకుతుందో లేదో అనే భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

రైతు తనకు ఎన్ని సర్వే నంబర్లలో పొలం ఉంటే అన్ని సర్వే నంబర్లకు మొత్తంగా కలుపుకొని ఏపీఎఫ్ ఆర్ పోర్టల్ లో నమోదు చేయించుకోవాలన్నారు. కొంతమంది రైతులు లంక భూములు, దేవాలయ భూములు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నామని వారికి సంబంధించి యజమాని ఓటిపి పంపించడానికి సమస్య ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అప్పుడు జమీందారులు రాజా గారు అధీనంలో ఉన్నందున ఆ జాబితాకు సంబంధించి వెసులుబాటు కొరకు ఢిల్లీకి వివరాలు పంపించామని అవి రాగానే అందరి సమస్య తీరుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులు యూరియా అధికంగా వాడితే భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు. భూసారం తగ్గితే పంటలు దెబ్బతింటాయన్నారు. రైతులందరూ యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్నారు

మరికొందరు రైతులు తాము పసుపు,కంద, చెరకు, అరటి తోటలు సాగు చేయడానికి కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తల సూచన మేరకు ఎకరాకు ఎంత మేరకు ఏ ఏ ఎరువులు ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. ఆ ప్రకారం అర్హత మేరకు రైతులకు ఏమేమి ఎరువులు ఇవ్వాలో అవి తప్పకుండా పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొందరు రైతులు నానో ఎరువులకు యూరియాకు లంకె పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ నానో ఎరువులకు, యూరియాకు ఎలాంటి సంబంధం లేదని రెండింటికి లంకె పెట్టరాదని కలెక్టర్ యూరియా కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలో వ్యవసాయ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా తదితర ఎరువుల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి మణి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, తోట్లవల్లూరు తహసిల్దారు కుసుమకుమారి, మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, విఎఏ బెన్నీ ఎమన్యుల్ తదితర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

About Author

SSN