అనుమతి లేని తవ్వకాలు జరపరాదు…. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
జిల్లాలోని గ్రామపంచాయతీ చెరువుల్లో ఎక్కడ కూడా అనుమతి లేనిదే తవ్వకాలు జరగరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడుతో కలిసి సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు , పంచాయతీ కార్యదర్శులతో గ్రామపంచాయతీ చెరువుల అక్రమ తవ్వకాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం గ్రామ పంచాయతీ చెరువులలో విధి విధానాలను అనుసరించి పద్ధతి ప్రకారం పూడిక మట్టి తొలగించడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ తీర్మానాలు చేసుకొని ప్రతిపాదనలు పంపిస్తే పూడిక మట్టితీతకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. చెరువులో పూడిక మట్టిని ముఖ్యంగా చెరువు కట్ట పటిష్ట పరచుటకు ఉపయోగించాలని, మిగిలినది ఏమైనా ఉంటే వేలం వేయాలన్నారు. వచ్చిన మొత్తాన్ని పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్నారు.
ఇటువంటి పద్ధతులను అనుసరించకుండా ఇటీవల కాలంలో కొందరు రాత్రిపూట గ్రామపంచాయతీ చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వార్తలు వెలువడుతున్నాయన్నారు. ఇది సరికాదని స్పష్టం చేస్తూ ఇకపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు జరిపితే అందుకు బాధ్యులైన వారి పైన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు
ఇకపై గ్రామపంచాయతీలో చెరువు తవ్వకం జరపాలంటే తప్పనిసరిగా గ్రామపంచాయతీ అనుమతి ఉండాలన్నారు. పంచాయితీ అసెస్మెంట్ పంచాయతీకి రావాలన్నారు. గృహ నిర్మాణంకు సంబంధించి లేఅవుట్ చదును చేయుటకు చెరువు మట్టి కావలసి వస్తే దానికి కూడా అనుమతి పొంది తవ్వకం చేసుకోవచ్చన్నారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా చెరువు మట్టి తవ్వకాలు జరిగేలా పర్యవేక్షిస్తామన్నారు. ఈ టెలికాన్ఫిడెన్స్ లో డిపిఓ ధనలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ రమణ రావు, డీఎస్పీలు, ఎంపీడీవోలు , డిప్యూటీ ఎంపీడీవోలు ఎస్హెచ్వోలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

