MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ ముప్పు.. అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ డీకే బాలాజీ

  • May 20, 2026
  • 0 min read
ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ ముప్పు.. అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

కృష్ణా జిల్లాపై రోహిణి కార్తె ఎండలు విరుచుకుపడనున్నాయి. మే 20 నుంచి 24వ తేదీ వరకు జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నమోదయ్యే అవకాశముందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. ఏపీఎస్డీఎంఏ, ఐఎండీ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ఆధారంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని సూచించారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రజలు తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం, గంజి వంటి ద్రవాలు తరచుగా తీసుకోవాలని సూచించారు. పలుచని, లేత రంగు పత్తి దుస్తులు ధరించడం, టోపీ లేదా గొడుగు వినియోగించడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు, కూలీలు మధ్యాహ్న సమయంలో పొలాల్లో పనులు తగ్గించుకోవాలని, పశువులకు తగిన నీరు, నీడ కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.

About Author

SSN