మచిలీపట్నం :
జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జల ధార కార్యాచరణ ప్రణాళిక పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన జలధార పథకం జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెంపుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.
చిన్న నీటిపారుదల చెరువు కట్టల వెంబడి వీలైనంత ఎక్కువగా రీఛార్జ్ షాఫ్టులను, పర్కులేషన్ ట్యాంకులను ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు నీరు వృధాగా పోకుండా చూడాలన్నారు. అన్ని మురికినీటి (డ్రైనేజీ ) కాలువల్లో అడ్డంకులన్నీ తొలగించి సిమెంట్ కాంక్రీట్ నిర్మాణంతో పనులు చేపట్టాలన్నారు. ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు, సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
తాడిగడప మున్సిపాలిటీలో కూడా భూగర్భ జలాల మట్టం పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నందివాడ, పామర్రు తదితర ప్రాంతాల్లో పనిచేయని పిజో మీటర్లను తొలగించి కొత్తవి అమర్చాలన్నారు. అవసరమైనంత నీటిని నిలువ చేసుకునేందుకు వీలుగా అవుట్ ఫాల్ స్లూయిస్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. జలధార పథకం కింద అన్ని భూగర్భ జలాలకు సంబంధించిన పనులు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి శివప్రసాద్, జలవనరుల శాఖ ఎస్ ఈ గుణకర్, ఈ ఈ లు గంగయ్య, కేసీఈ ఈ ఈ రవికిరణ్, డ్రైనేజీ ఈ ఈ కిరణ్ బాబు, కేఈఈ ఈఈ ఆంజనేయ ప్రసాద్, భూగర్భ జల శాఖ ఏడి బిందు శ్రీ, పలువురు జలవనరుల శాఖ డీఈఈలు, ఏ ఈ లు పాల్గొన్నారు.