MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

రేపే కృష్ణా జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు

  • October 31, 2026
  • 0 min read
రేపే కృష్ణా జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు పురపాలక సంఘాలకు ఆదివారం (నవంబరు 1) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, నమోదైన ఓట్ల లెక్కింపును నవంబరు 3న చేపట్టనున్నారు.

మూడు స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 1,97,412 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఎన్నికల నిర్వహణ కోసం 241 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ డి.కె. బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు 241 మంది ప్రిసైడింగ్ అధికారులు, 723 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

పట్టణ స్థానిక సంస్థల వారీగా వివరాలు

మచిలీపట్నం నగరపాలక సంస్థ

మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 1,39,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 66,504 మంది పురుషులు కాగా, 72,732 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేయర్ పదవికి 5 గురు అభ్యర్థులు బరిలో ఉండగా, 60 డివిజన్ల కార్పొరేటర్ స్థానాలకు 142 మంది పోటీ పడుతున్నారు. మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో 147 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

పెడన పురపాలక సంఘం

పెడన మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25,373 మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోగా, వారిలో 12,212 మంది పురుషులు, 13,161 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 32 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ముగ్గురు అభ్యర్థులు, 28 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తంగా పెడనలో 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఉయ్యూరు పురపాలక సంఘం

ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32,793 మంది ఓటర్లు ఉండగా, వారిలో 15,768 మంది పురుషులు, 17,024 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి 6 గురు అభ్యర్థులు, 32 వార్డు కౌన్సిలర్ స్థానాలకు 86 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తంగా ఉయ్యూరులో 92 మంది అభ్యర్థులు పోరులో నిలిచారు.

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ డి.కె. బాలాజీ పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ ఎలాంటి అభద్రతా భావానికి లోనుకాకుండా, స్వేచ్ఛగా మరియు నిర్భయంగా తమ సమీప పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

About Author

SSN