నిత్యావసరాల ధరల మంట: వైఎస్సార్సీపీ వర్సెస్ కూటమి
ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజం!
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకులు, ఇంధనం మరియు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. 2024లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలతో పోలిస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆయన సోషల్ మీడియా వేదిక ‘X’ (ట్విట్టర్)లో ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
‘X’ పోస్ట్‌లోని ప్రధాన అంశాలు & ధరల పోలిక
బియ్యం (సోనా మసూరి): 2024లో 25 కిలోల బస్తా ధర రూ. 1,400 (కేజీ రూ. 56) ఉండగా, 2026 నాటికి అది రూ. 2,375 (కేజీ రూ. 95)కి చేరి 70% పెరిగింది.
పామ్ ఆయిల్: లీటరు రూ. 85 నుండి రూ. 165కి పెరిగి 94% వృద్ధి చెందింది.
సన్‌ఫ్లవర్ ఆయిల్: లీటరు రూ. 110 నుండి రూ. 189కి చేరి 72% పెరిగింది.
ఉల్లిపాయలు: కేజీ రూ. 15 నుండి ఏకంగా రూ. 80కి ఎగబాకి అత్యధికంగా 433% పెంపును నమోదు చేసింది.
కందిపప్పు: కేజీ రూ. 110 నుండి రూ. 180కి చేరి 64% పెరిగింది.
చక్కెర: కేజీ రూ. 30 నుండి రూ. 65కి పెరిగి 117% భారం పడింది.
పాలు: లీటరు రూ. 44 నుండి రూ. 80కి చేరి 82% పెరిగింది.
కోడిగుడ్లు: గుడ్డు ధర రూ. 4.50 నుండి రూ. 8కి చేరి 78% పెరిగింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్: రూ. 825 నుండి రూ. 964కి చేరి 17% పెరిగింది.
టమాటాలు: కేజీ రూ. 20 నుండి రూ. 55కి చేరి 175% పెరిగింది.
ఇంధన ధరలు: పెట్రోల్ లీటరు రూ. 109 నుండి రూ. 117.61కి (8%), డీజిల్ లీటరు రూ. 94 నుండి రూ. 105.30కి (12%) పెరిగాయి.
ఇవే కాకుండా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరియు ఇతర సేవలు కూడా ప్రియమవ్వడంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులైందని ఆయన పేర్కొన్నారు.
ధరల స్థిరీకరణ నిధి ఏదీ?
2024 ఎన్నికల సమయంలో కూటమి తమ ఉమ్మడి మేనిఫెస్టో “ప్రజాగళం” లో నిత్యావసరాల ధరలను అదుపు చేయడానికి “ధరల స్థిరీకరణ నిధి” ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడమే ఈ నిధి ప్రధాన లక్ష్యం.
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం గడిచినా, మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీ అమలు దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
శ్యామ్ కాగిత
మచిలీపట్నం

