స్థానిక ఎన్నికల కుట్రల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బెంగళూరు ఆస్తులపై విషప్రచారం: మాజీ మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషప్రచారం చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఖూనీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే యలహంక ఆస్తులపై కావాలని వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు
ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు వద్ద ఎలాంటి సాధనలు లేవని, ప్రజల మద్దతు కూడా కూటమికి పూర్తిగా కరువైందని పేర్ని నాని విమర్శించారు. ఒకవైపు ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉండటానికి పోలీసులు క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పడం ఎక్కడా లేని వింత అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఏజెంట్లు లేకుండా పోలింగ్ కేంద్రాలను దక్కించుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు.
యలహంక ప్రాపర్టీ జగన్ అత్తగారిదే!
బెంగళూరు యలహంక ఆస్తి వివాదంపై పేర్ని నాని స్పష్టతనిచ్చారు. “యలహంక ఆస్తి జగన్‌గారి అత్తగారు డాక్టర్ సుగుణమ్మగారిది. జగన్ భార్య భారతిగారి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణమ్మ ఇద్దరూ నాటి కాలంలోనే కడప, అనంతపురం జిల్లాల్లో పేరుపొందిన ప్రముఖ వైద్యులు, స్థితిమంతులు. వారి పిల్లలను అప్పట్లోనే బెంగళూరులో చదివించి, అక్కడ ఆస్తి కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితమే ఆ స్థలాన్ని జగన్ కంపెనీ లీజుకు తీసుకుని రెండు గెస్ట్‌హౌస్‌లు నిర్మించింది. అక్కడి బిల్లులు, నిర్వహణ ఛార్జీలన్నీ జగన్ కంపెనీయే చెల్లిస్తోంది. కేవలం ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నంత మాత్రాన, తాజ్‌మహల్ చూసి ‘నాదే’ అంటే ఇచ్చేస్తారా?” అని ఎద్దేవా చేశారు. షర్మిలకు రాసిన ఒప్పంద పత్రం (MOU)లో కూడా ఈ యలహంక ఆస్తి ప్రస్తావన ఎక్కడా లేదని వివరించారు.
చంద్రబాబు రాజకీయం కోసమే షర్మిల తెరపైకి..
వైఎస్సార్ మరణం తర్వాత కూడా చెల్లెలు షర్మిలపై ఉన్న ప్రేమతో జగన్మోహన్రెడ్డి దాదాపు రూ.230 కోట్లు ఇచ్చారని, పెళ్లై పాతికేళ్లయ్యాక కూడా చెల్లెలికి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి ఇచ్చే అన్న ఈ సమాజంలో ఎక్కడైనా ఉన్నాడా అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడు రాజకీయ లబ్ధి అవసరమైతే అప్పుడు షర్మిల తెరపైకి వచ్చి జగన్‌పై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. భద్రతా కారణాల రీత్యా యలహంక వద్ద పెళ్లి వేడుక వద్దని ముందే స్పష్టం చేసినప్పటికీ, కావాలనే వివాదం రాజేసేందుకు షర్మిల అక్కడే పెళ్లికార్డులు అచ్చు వేయించారని, హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇంటిని వాడుకోమన్నా ఎందుకు తిరస్కరించారని నిలదీశారు.
సొంత కుటుంబానికి చంద్రబాబు ఇచ్చిన వాటా ఎంత?
ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు తన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. “తనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు.. తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? అసలు తన చెల్లెళ్లను ఎప్పుడైనా ఆదరించారా? హైదరాబాద్ మాదాపూర్‌లోని 7 ఎకరాల భూమిని కేవలం నారా లోకేష్‌కు మాత్రమే గిఫ్ట్ డీడ్ కింద ఎందుకు ఇచ్చారు? మిగిలిన పిల్లలు కొడుకులు కారా?” అని ప్రశ్నించారు.
పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయలేక, మేనిఫెస్టోలోని 143 వాగ్దానాలను విస్మరించి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతోనే ఎన్నికల సమయంలో ఇటువంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

