MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

తుపాను ముప్పు వేళ నిత్యవసరాలు, ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

  • October 27, 2026
  • 0 min read
తుపాను ముప్పు వేళ నిత్యవసరాలు, ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రత్యేక దృష్టి

మచిలీపట్నం:

‘అర్నబ్’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర సరుకులు, వంటగ్యాస్ (ఎల్పీజీ), ఇంధన సరఫరాపై జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంకుల యజమానులు మరియు నిర్వాహకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, వ్యాపారులకు సూచించారు.

ఈ సందర్భంగా శివరామప్రసాద్ మాట్లాడుతూ… వినియోగదారులకు అవసరమైన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. తుపాను కారణంగా సాధారణ సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. కొరత ఏర్పడకుండా సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాలని, గ్యాస్ సరఫరాపై ప్రజల్లో అనవసర ఆందోళనలు నెలకొనకుండా వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు వెల్లడించాలని తెలిపారు.

అలాగే తుపాను సమయంలో రేషన్ బియ్యం పంపిణీకి ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నిల్వ కేంద్రాలు మరియు చౌకధరల దుకాణాల్లో అవసరమైన మేరకు బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచి, సకాలంలో ప్రజలకు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటూ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, నిత్యావసరాలు ప్రజలందరికీ లభ్యమయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

About Author

SSN