కృష్ణా జిల్లా పరిషత్ ఐదేళ్ల ప్రయాణం అభినందనీయం: కలెక్టర్ డీకే బాలాజి
• రూ. 400 కోట్లతో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
• జిల్లా పరిషత్ పాలకవర్గానికి ఘనంగా ఆత్మీయ సత్కారం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గం తమ ఐదేళ్ల పదవీకాలంలో జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కొనియాడారు. జిల్లా పరిషత్ వ్యవస్థ అనేది జిల్లా సమగ్ర అభివృద్ధికి వెన్నెముక వంటిదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆఖరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పాలకవర్గానికి ఆత్మీయ వీడ్కోలు, ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 400 కోట్ల జడ్పీ నిధులతో మారుమూల గ్రామాల్లో సైతం మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
పాలకవర్గం చేపట్టిన ముఖ్య అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు:
* తాగునీటి సదుపాయం: సీపీడబ్ల్యూ (CPW) పథకాల కింద సుమారు రూ. 210 కోట్లు వెచ్చించి తాగునీటి ఎద్దడి లేకుండా పనులు చేపట్టినట్లు తెలిపారు.
* మహిళా సాధికారత: మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు రూ. 30 లక్షల ఖర్చుతో కుట్టు శిక్షణ ఇవ్వడమే కాకుండా 400 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
* ‘స్ఫూర్తి’ విద్యా కార్యక్రమం: 10వ తరగతి విద్యార్థుల కోసం ‘స్ఫూర్తి’ పేరుతో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించేందుకు ఐదేళ్లలో రూ. 1.40 కోట్లు వెచ్చించారు.
* కారుణ్య నియామకాలు: విధి నిర్వహణలో, కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని 260 మందికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు.
* గ్రామీణ మౌలిక వసతులు: గ్రామీణ ప్రాంతాల్లో అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించేందుకు పలు గ్రామాల్లో క్రిమేషన్ షెల్టర్లను నిర్మించారు.
ఈ సందర్బంగా చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, 1960లో ప్రారంభమైన కృష్ణా జిల్లా పరిషత్‌కు మొదటి చైర్మన్ యాళ్లగడ్డ శివరామప్రసాద్ నుంచి నేటి వరకు పది మంది చైర్మన్లు సేవలందించారని గుర్తుచేశారు. ఈ ప్రయాణం కేవలం పదవీకాల ముగింపు మాత్రమేనని, భవిష్యత్ ప్రజాసేవకు ఇది మరో పునాది అని పేర్కొన్నారు. తన పాలనకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, మరియు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా వినియోగించడంలో జడ్పీ పాలకవర్గం, అధికారులు, ప్రాథమిక స్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, జడ్పీ సీఈఓ డాక్టర్ జె. అరుణ, డిఆర్వో కే శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఆనంద్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుడిమళ్ళ కృష్ణంరాజు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్ డీకే బాలాజిని కూడా పాలకవర్గం ప్రత్యేకంగా అభినందించింది.

