MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

డీఎస్సీపై వైసీపీ నేతలు ఆధారాలతో చర్చకు రావాలి: మంత్రి కొల్లు రవీంద్ర

  • September 16, 2026
  • 1 min read
డీఎస్సీపై వైసీపీ నేతలు ఆధారాలతో చర్చకు రావాలి: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరోపణలు చేసి తప్పించుకోవడం సరికాదని పేర్కొన్నారు. డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కోర్టులు కొట్టివేసినా అదే అంశాన్ని పదేపదే ప్రస్తావించడం సరికాదని విమర్శించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది టీడీపీ హయాంలో నియమితులైనవారేనని మంత్రి పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.

ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో ఆటలాడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం కారణంగా యువత జీవితాలు నష్టపోయాయని ఆరోపించారు. ఉద్యోగులు గిఫ్టులు తీసుకుంటే తప్పేంటని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. అవినీతిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మూల్యాంకనంపై దర్యాప్తు చేసిన సిట్‌ తన నివేదికను హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. మూల్యాంకన ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు, పలు అవకతవకలు గుర్తించినట్లు సిట్ నివేదికపై వచ్చిన తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఏపీపీఎస్సీపై జరుగుతున్న దర్యాప్తును స్వాగతించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కొల్లు రవీంద్ర తెలిపారు.

About Author

SSN