MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

మంగినపూడి సాగర తీరంలో విజయగణపతిని దర్శించుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్

  • September 15, 2026
  • 0 min read
మంగినపూడి సాగర తీరంలో విజయగణపతిని దర్శించుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్

మచిలీపట్నం :

కృష్ణా జిల్లా మంగినపూడి సాగర తీరంలో వెలసిన 63 అడుగుల సప్తమృత్తిక విజయగణపతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. మంగినపూడి బీచ్‌లో ఘనంగా నిర్వహిస్తున్న మహాగణపతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విజయవాడ నుండి రోడ్డు మార్గాన మంగినపూడి బీచ్‌ వద్దకు చేరుకున్న గవర్నర్‌కు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ స్వామివారికి దివ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

సప్తమృత్తికలతో ప్రత్యేకంగా తయారు చేసిన 63 అడుగుల విజయగణపతి విగ్రహ విశేషాలను, ఉత్సవాల నిర్వహణను నిర్వాహకులు గవర్నర్‌కు వివరించారు. ఈ ప్రదేశ విశిష్టతను, ప్రతిమ రూపురేఖలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాములతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం మరియు పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం గవర్నర్ రోడ్డు మార్గంలో తిరిగి విజయవాడకు పయనమయ్యారు.

About Author

SSN