ఎల్పీజీ హోం డెలివరీలో జాప్యం వద్దు: డీలర్లకు పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
మచిలీపట్నం :
వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను సకాలంలో హోం డెలివరీ చేయాలని, నిర్ణీత ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎల్పీజీ డీలర్లను హెచ్చరించారు. కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి అధ్యక్షతన సోమవారం సీఎస్ డీటీలు, ఎల్పీజీ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ
చేశారు. వినియోగదారులు బుక్ చేసుకున్న సిలిండర్లను ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా వారి ఇళ్లకే అందించాలి. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు నిర్ణయించిన ఛార్జీల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదు. సిలిండర్ల మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు ఉంటాయి. స్టాక్, బుకింగ్, డెలివరీ వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ విధానంలో పారదర్శకంగా నమోదు చేయాలి. సీఎస్ డీటీలు డీలర్ల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, అవకతవకలు జరిగితే తక్షణమే ఉన్నతాధికారులకు నివేదించాలి.
వినియోగదారుల సంతృప్తి, భద్రత, పారదర్శక సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చిచెప్పారు.

