MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఘనంగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గంగాధర్‌రావు పదవీ విరమణ సన్మానం

  • September 1, 2026
  • 1 min read
ఘనంగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గంగాధర్‌రావు పదవీ విరమణ సన్మానం

మచిలీపట్నం :

ఎక్సైజ్‌ శాఖలో సాధారణ ఎస్సై స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ పొందిన గంగాధర్‌రావుకు సిబ్బంది, ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. కృష్ణా జిల్లా ఎక్సైజ్‌ శాఖలో దాదాపు 43 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన ఆయనను గౌరవిస్తూ సోమవారం ప్రత్యేక సన్మాన సభను నిర్వహించారు.

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (SI)గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగాధర్‌రావు విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధత, నిరంతర క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. పదోన్నతులు పొందుతూ చివరికి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

స్ఫూర్తిదాయకమైన సేవలు

ఈ సభలో సహచర అధికారులు, సిబ్బంది ఆయనతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాఖ అభివృద్ధికి, ప్రభుత్వ ఆదాయ పరిరక్షణకు ఆయన అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విధి పట్ల నిబద్ధతతో వ్యవహరించిన ఆయన సేవా ప్రస్థానం తోటి ఉద్యోగులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం గంగాధర్‌రావు దంపతులు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ఆయనను దుశ్శాలువాతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు (విజయవాడ), కృష్ణా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ భార్గవ్, పలువురు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN