MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

కృష్ణా జెడ్పీ పీఠంపై మహిళల హవా: చైర్‌పర్సన్‌గా భోగాది రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌గా దండమూడి పూజిత

  • November 20, 2026
  • 1 min read
కృష్ణా జెడ్పీ పీఠంపై మహిళల హవా: చైర్‌పర్సన్‌గా భోగాది రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌గా దండమూడి పూజిత

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా పరిషత్ (జెడ్పీ) నూతన పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నాగాయలంక మండలం జెడ్పీటీసీ సభ్యురాలు భోగాది రమాదేవి, వైస్ చైర్‌పర్సన్‌గా కంకిపాడు మండలం జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి పూజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.

25 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం

ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలుత జిల్లాలోని 26 మండలాల జెడ్పీటీసీ సభ్యులకు సమావేశానికి ఆహ్వానం పలికారు. వీరిలో కోడూరు మండల జెడ్పీటీసీ సభ్యురాలు బొలిశెట్టి అరుణశ్రీ మినహా మిగిలిన 25 మంది సభ్యులతో కలెక్టర్ డీకే బాలాజీ ప్రమాణ స్వీకారం చేయించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఏకగ్రీవ ఎన్నిక సాగిందిలా..

 * చైర్‌పర్సన్ ఎన్నిక: నాగాయలంక జెడ్పీటీసీ భోగాది రమాదేవి పేరును పమిడిముక్కల జెడ్పీటీసీ తాతినేని ప్రవళి ప్రతిపాదించగా, ఘంటసాల జెడ్పీటీసీ దోవారి పవిత్ర బలపరిచారు. దీంతో భోగాది రమాదేవి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.

 * వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక: కంకిపాడు జెడ్పీటీసీ దండమూడి పూజిత పేరును మచిలీపట్నం దక్షిణ మండల జెడ్పీటీసీ కాగిత వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, గుడ్లవల్లేరు జెడ్పీటీసీ వర్రే బలరామకృష్ణ బలపరిచారు. ఫలితంగా దండమూడి పూజిత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ఎన్నిక అనంతరం నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించి, ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి. అభిషేక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్‌లతో పాటు జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN