వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పమే విజయానికి తొలి అడుగు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆశావహులకు అవగాహన కార్యక్రమం
మచిలీపట్నం:
వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పమే విజయానికి తొలి అడుగని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలు, రుణాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని యువత, మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. వ్యాపార ఆలోచనతో పాటు పట్టుదల, నిరంతర కృషి ఉంటే చిన్న స్థాయి ప్రయత్నాలు సైతం పెద్ద విజయాలుగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.
గురువారం మచిలీపట్నం నగరంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నేషనల్ ఎస్సీ–ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆశావహులకు పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ పథకాలు, రుణాల మంజూరు, మార్కెటింగ్ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం, సమాజం, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యతో పాటు వ్యాపార స్ఫూర్తి కూడా ఎంతో అవసరమని అన్నారు.
మన దేశంలో ప్రతిభ, అవకాశాలు ఉన్నప్పటికీ వ్యాపారవేత్తలుగా మారాలనే ఆలోచన చాలామందిలో లేకపోవడం ప్రధాన సమస్య అని కలెక్టర్ అన్నారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త ఉత్పత్తులు, సేవలను అందిస్తూ ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా యువత ముందుకు రావాలని సూచించారు. వ్యాపారవేత్తగా మారాలనే సంకల్పం వచ్చిన క్షణం నుంచే విజయానికి సగం దూరం చేరుకున్నట్టేనని పేర్కొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులు, నైపుణ్యాలు, మార్కెట్ అనుసంధానం ద్వారా ప్రగతి సాధించవచ్చున్నారు. వ్యాపారం ప్రారంభించేందుకు పెద్ద పెట్టుబడులు లేదా ఉన్నత విద్య మాత్రమే అవసరం కాదని, సంకల్పం, కృషి, పట్టుదల ముఖ్యమని చెప్పారు. ముంబైలో ఏడుగురు మహిళలు చిన్న స్థాయిలో ప్రారంభించిన లిజ్జత్ పాపడ్ సంస్థ నేడు వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థగా ఎదిగిన విషయాన్ని ఉదాహరణగా వివరించారు.
జిల్లాలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యాపార ఆలోచనలు కలిగిన మహిళలు, యువతను గుర్తించి వారికి రుణాలు, శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ‘బయ్యర్–సెల్లర్ మీట్స్’ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రారంభంలో 200 మందితో చేపట్టాలని భావించిన ఈ కార్యక్రమానికి ప్రస్తుతం 738 మందికి పైగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. వ్యాపారంలో సవాళ్లు సహజమని, విఫలమయ్యామనే భయంతో వెనుకడుగు వేయకుండా నిరంతరం ప్రయత్నిస్తే తప్పక విజయాన్ని సాధించవచ్చని అన్నారు.
పీఎంఈజీపి, పీఎంఎఫ్‌ఎంఈ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు, రుణ సదుపాయాలు అందిస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని కృషి చేస్తున్నదన్నారు. వ్యాపార ఆలోచనలు కలిగిన వారికి అవసరమైన మార్గదర్శకత్వం, రుణాలు, మార్కెట్ అనుసంధానం వంటి సహాయ సహకారాలను ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని, అయితే వ్యాపార ప్రణాళిక రూపొందించి ముందడుగు వేయాల్సింది యువత, మహిళలేనని కలెక్టర్ స్పష్టం చేశారు. అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐసీసీ సౌత్ జోన్ ప్రెసిడెంట్ రామారావు, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు, నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ ఏపీ తెలంగాణ జిఎం ఎస్ సురేష్, బీడీఎల్ డీజిఎం మెహర్ రత్నాకర్, ఎంఎస్ఎమ్ఈ డిఐ చంద్రమౌళి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఆశావాహ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

