రోగులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పని చేయాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
మచిలీపట్నం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సేవల నాణ్యత పెంపు, పారదర్శక పరిపాలన, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ, పరిపాలనా విధానాలు, సమస్యలు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు.
సమస్యలను అధికారిక మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని, ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలని, మాన్యువల్ ఫైళ్లకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ రోగులకు ఉత్తమ సేవలు అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, కొనుగోళ్ల ప్రక్రియలో జెమ్ (Government e Market place–GeM), ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్స్ ద్వారానే వ్యవహరించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరూ ఒక జట్టుగా పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. ఆసుపత్రి అభివృద్ధి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి లీల ప్రసాద్, డాక్టర్ జి భానుమూర్తి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బోయిన వెంకట కృష్ణమరాజు, లింగం విజయ్, భూపతి త్రిపుర, విక్కుర్తి సాయిబాబు, ఎండి బాషి, ఇతర వైద్యులు, పరిపాలన విభాగం అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

