వైసీపీ పైశాచికత్వానికి పరాకాష్ట డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య
మచిలీపట్నం:
జగన్ ఐదేళ్ల పాలనంతా అరాచకాలు, అకృత్యాలు, దాడులు, హత్యలేనని అందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డెడ్ బాడీ డోర్ డెలివరీ నిదర్శనమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఐదేళ్ల వైసీపీ పాలన దళితులకు నరక యాతన పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలపైనా కక్ష సాధింపులకు పాల్పడ్డారు. బడుగు బలహీన వర్గాలపై చేసిన దాడులు, దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వైసీపీ నేతల పైశాచికత్వానికి నిదర్శనం. కేసును తారుమారు చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. చివరికి సాక్షుల్ని కూడా బెదిరించారు. రెండేళ్ల పాటు కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. నిందితులకు వైసీపీ నేతలు ఊరేగింపులు చేశారు.
జగన్ రెడ్డి పాలనంతా దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడమే. మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడుని ముద్ర వేసి హింసించి చంపేశారు. మద్యం అక్రమాలు ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ ను చంపేశారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వర ప్రసాద్ కు పోలీస్ స్టేషన్లోనే గుండుకొట్టారు. తోట చంద్రయ్యను నడి రోడ్డుపైనే పీక కోసి చంపారు. నందం సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారు. పల్నాడులో అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడిని పెట్రోల్ పోసి తగులబెట్టేశారు.
ఇప్పుడు కులం మతం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ రెడ్డి అండ్ కో కుట్రలు చేస్తున్నారు. అధికారులకు కులం మతం అంటగట్టి వేధిస్తున్నారు. పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే మతం పేరుతో రాజకీయం చేయాలనుకున్నారు. వైసీపీ అక్రమాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని రాష్ట్రం నుండి తరిమికొట్టే యుద్ధంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

