కలెక్టరేట్ మీకోసంలో మొత్తం 135 అర్జీలు
మచిలీపట్నం:
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, మెప్మా పీడీ సాయిబాబు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావు లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఇరువురు వారి సిబ్బందితో కలిసి క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టరేట్కు సైకిల్లో రావడం చెప్పుకోదగ్గ విశేషం.
కలెక్టరేట్లో మొత్తం 135 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు
చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సబ్బినేని లక్ష్మి (77) తన కుమార్తె సుమలత సహాయంతో చక్రాల కుర్చీలో మీకోసం సమావేశ భవనం వద్దకు రాగా జిల్లా కలెక్టర్ వేదిక నుండి కిందికి దిగివచ్చి స్వయంగా ఆమెతో మాట్లాడి ఎంతో ఓపికగా ఆమె సమస్యను ఆలకించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు దివ్యాంగుల పించను 6వేల రూపాయలు వస్తోందని, తనకు పక్షవాతం వచ్చి మంచం నుండి లేవ లేకపోతే నలుగురు పట్టుకొని ఇక్కడికి తీసుకు వచ్చారని, తనకు 15000 రూపాయల పింఛను మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ అందజేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ప్రభుత్వ పాలసీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ యుగంధర్ కు సూచించారు.
మొవ్వ మండలం బాట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన చలసాని సుబ్బారావు తన ఇంటి పక్కన పామర్తి శీను అనే అతను రహదారి మార్జిన్ లో తాత్కాలికంగా ఇల్లు నిర్మించుకుని రహదారి అవరోధాలు కలిగిస్తున్నారని, 9 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నదని రాకపోకలకు ఇబ్బందిగా ఉంటున్నందున ఇప్పటికీ రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నానని తమకు 18 అడుగుల బాట వచ్చే విధంగా చూడాలని కోరుతూ అర్జీ అందజేశారు.
కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రాక పాశ్చాపురం గ్రామస్తులు వీరమల్లు వెంకటేశ్వరమ్మ తన భర్త నాగబాబు చనిపోయారని తనకు వితంతు పించను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
పామర్రు మండలం కొరిమెర్ల గ్రామ వాస్తవ్యులు వరుచూరి ఉదయ్ కుమార్ భార్య రమ్య తనకు 9 సంవత్సరాల పాప నమీకలక్ష్మి ఉన్నదని, జెనిటికల్గా వచ్చిన తీవ్రమైన కండరాల వ్యాధితో ఎదుగుదల లేక బాధపడుతున్నదని, ఆమె పనులన్నీ మంచం మీద ఉండి చేయవలసి వస్తున్నదని, ఆమెకు వైద్య సదుపాయాలు, మందులకు కావలసిన ఆర్థిక సహాయం అవసరం ఉన్నదని, పింఛను మంజూరు చేయవలసినదిగా కోరుతూ అర్జీ అందజేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మచిలీపట్నం నగర కమిటీ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మరి కొంతమంది తో కలిసి అర్జీ అందజేస్తూ మచిలీపట్నం రాజుపేట వర్రేగూడెంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత మూడు నెలల నుండి డాక్టర్లు లేరని, దీంతో గర్భవతులకు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని వెంటనే డాక్టర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోడూరు మండలం ఉల్లిపాలెం శివారు శ్రీరామపురం కాపురస్తులు నడకుదుటి నారాయణమూర్తి కుమారుడు సత్యనారాయణ మాట్లాడుతూ దివిసీమలో మేజర్ డ్రైన్ అయినా రత్నకోడు నుంచి న్యూ ఇరాలి డ్రయిన్ క్యాచ్మెంట్ లోకి నీరు భారీగా వచ్చేటట్టుగా ఆక్వా రైతులు వేసిన మీటర్ సైజు అక్రమ పైపుల వలన తమ పంట పొలాల్లోకి నీరు చేరి పంటలు పండించుకోలేకపోతున్నామని, తమ కుటుంబాలకు వేరే జీవనాధారం లేదని తెలియజేస్తూ అక్రమ పైపులను తొలగించి వరి మాగాని పొలం ముంపుకు గురి కాకుండా కాపాడాలని కోరుతూ అర్జీ అందజేశారు
అసంపూర్తి భవనాల వివరాలు 25వ తేదీలోగా అందజేయాలి
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో 50 శాతానికి పైగా పనులు జరిగి అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల పూర్తికి అవసరమైన నిధుల కోసం అంచనాలను జిల్లా అధికారులు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ విభాగం వారితో సమన్వయం చేసుకొని ఈనెల 25వ తేదీలోగా నివేదిక అందజేయాలన్నారు. ఆ నివేదికను ఈ… కార్యాలయం ద్వారా పంపితే దానిని అదే ఈ… దస్త్రం ద్వారానే ప్రధాన కార్యదర్శి కి పంపడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజు శాఖ అధికారుల పరిధిలో ఇలాంటి అసంపూర్తి భవనాలు ఎక్కువగా ఉన్నాయని వాటి పూర్తికి సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి
జిల్లాలో ఇకపై ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన ఫ్లెక్సీ బ్యానర్లకు బదులుగా గుడ్డతో చేసిన బ్యానర్లను కేవలం ఒకటి ఏర్పాటుచేసిన చాలని ఇందుకోసం ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించిన వారమవుతామన్నారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ను తొలగించి గుడ్డ బ్యానర్ను ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఏవో కు సూచించారు.
సానిటరీ నాప్కిన్ పాడ్స్ బదులుగా మెన్స్ట్రైవల్ కప్స్ ప్రయోగత్మకంగా వాడకం
సానిటరీ నాప్కిన్ పాడ్స్ వలన కూడా చెత్త పెరిగిపోతుందని దాన్ని నివారించుటకు ఇటీవల కాలంలో మెన్స్ ట్రూవల్ కప్స్ వచ్చాయని అవి 2 లేదా 3 సంవత్సరాల కాలం పాటు వేడినీటిలో స్టెర్లైజ్ చేసి వినియోగించవచ్చన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా కొన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలో వాటిని వినియోగించాలన్నారు
విజయ గాధలు పంపించాలి
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలకు సంబంధించిన విజయగాధలను వెంటనే సాయంత్రం కల్లా అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖరు డిపిఓ ఎం ధనలక్ష్మి డిఎస్ఓ డాక్టర్ యుగంధర్ జడ్పీ సీఈవో గృహ నిర్మాణ సంస్థ పిడి జిల్లా అధికారి వెంకటరావు సర్వే భూ రికార్డుల ఏడి లక్ష్మణ్ బాబు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

