MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటును పెంపొందించాలి: కలెక్టర్ డీకే బాలాజి

  • September 17, 2026
  • 0 min read
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటును పెంపొందించాలి: కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటు, ఆర్థిక క్రమశిక్షణ మరియు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచించారు. మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో చిలకలపూడిలోని పాండురంగ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాల పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాస్‌బుక్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక రూపాయి, రెండు రూపాయలు అని చిన్నచూపు చూడకుండా క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఖాతాలు తెరవడమే కాకుండా అందులో క్రమం తప్పకుండా డబ్బు జమ చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని, ఇది భవిష్యత్‌లో ఆర్థిక భద్రతకు మరియు స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. పొదుపుతో పాటు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ, క్రమశిక్షణతో చదువుకోవాలని ఆకాంక్షించారు.

తపాలా శాఖ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటివరకు 125 ఆర్డీ ఖాతాలు ప్రారంభించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

SSN