సముద్ర తీరాల పరిరక్షణ అందరి బాధ్యత: ‘స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్’లో నిపుణులు
పెడన :
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని ఒర్లగొంది తిప్ప గ్రామంలో “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్కాయిస్ ప్రతినిధి ఎం. మహేందర్, రాష్ట్ర మత్స్య సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ సమక్షంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తీర ప్రాంతాన్ని శుభ్రపరిచారు. బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సముద్ర తీరాలను స్వచ్ఛంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడ తీవ్ర ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు సురక్షితమైన సముద్ర పర్యావరణాన్ని అందించవచ్చని స్పష్టం చేశారు.
భారతదేశ సముద్ర సమాచార రంగంలో ఇన్కాయిస్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రతినిధులు తెలిపారు. మత్స్యకారులకు చేపల వేటకు అనుకూల ప్రాంతాల (PFZ) సమాచారం, సముద్ర అలల హెచ్చరికలు, సునామీ ముందస్తు సూచనలు మరియు తుఫానుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందిస్తూ తీరప్రాంత ప్రజల భద్రతకు తోడ్పడుతోందని వివరించారు. సముద్ర వనరుల పరిరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణపై ఇన్కాయిస్ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

