[addtoany]
మచిలీపట్నం :
చెత్తరహిత స్వచ్ఛ మచిలీపట్నం నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
ఆదివారం ఉదయం తెల్లవారుజామునే జిల్లా కలెక్టర్ వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూతనంగా రూపొందించిన స్వచ్ఛ ఆయుధం చేతబూని నగరంలోని 16వ డివిజన్ రామానాయుడు పేటలో ఐదు రోడ్ల సెంటర్ వరకు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా చెత్తాచెదారాలను, ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. వారికి తోడుగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వసుధ జీవవైవిద్య బృందం మణిరత్నం నాయకత్వంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ ఆయుధంతో చెత్త ఏరివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ ప్రాంతంలో కలెక్టర్ పర్యటిస్తూ రహదారి పైన గాని, ఇరువైపులా గాని చెత్తాచెదారాలు ఎక్కడపడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి ప్రజలకు సూచించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నం గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు.
ఈ దిశలో ప్రధానంగా పరిశీలిస్తే చెత్త ఎక్కడబడితే అక్కడ ఉంటున్నట్లు గమనించడం జరిగిందన్నారు
అది ఉండకుండా చేయాలంటే రోజు పారిశుధ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి చెత్త తొలగించి, మురికి కాలువలో పూడిక తీయాలంటే ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొందరు స్వచ్ఛంద కార్యకర్తలను చైతన్యపరిచి వాళ్ళ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆయుధం ద్వారా చెత్తాచెదారాలను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఈ కార్యక్రమానికి స్వచ్ఛ సైనికులు అని పేరు పెట్టామన్నారు. ఆ ప్రకారంగా నేడు రామానాయుడు పేటలో నివసించే వారితో కలిసి స్వచ్ఛ ఆయుధంతో చెత్తను ఎరివేసే కార్యక్రమం చేపట్టామన్నారు గతంలో చేతులతో చెత్తను తీసేటప్పుడు వంగి తీయడం వలన చాలా సమస్య ఏర్పడేదని, ప్రస్తుతం మనిషి నిలుచునే ఎక్కువ చెత్తను సులభంగా ఏరివేసేందుకు పట్టకార లాగా ఉండే ఈ స్వచ్ఛ ఆయుధం ఎంతగానో బాగుందన్నారు.
నగరంలోని ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తరలివచ్చి ప్రతిరోజు ఉదయమే ఒక అర్థగంట కేటాయించి చెత్తను ఎరివేస్తే వారు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చన్నారు.
మొదట్లో చెత్త కొంత ఎక్కువగా ఉన్న ఆ తర్వాత ఏ రోజు చెత్త ఆరోజు తీసివేయడం వలన పెద్దగా పని ఉండదన్నారు.
ఆ ప్రకారం గా పారిశుద్ధ్య కార్మికులతో ప్రజలందరూ పాల్గొని చెత్త రహిత మచిలీపట్నం గా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలన్నారు
స్వచ్ఛ సైనికులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టామని ఇందులో ప్రజలందరూ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
ఆ క్రమంలో వసుధ జీవవైవిద్య బృందం కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. వారు తనతో కలిసి రామానాయుడు పేటలో రహదారి మొత్తం పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు.
వాళ్లు వారి నివసించే ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఇకపై ప్రతిరోజు ఉదయమే వారి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని ముందుకు వచ్చారన్నారు.
ఇదేవిధంగా ప్రజలందరూ వారు నివసించే ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడ ప్రతిరోజు ఉదయం ఒక అరగంట వారి ప్రాంతాన్ని పరిశుభ్రం చేయాలన్నారు.
ఉదయాన్నే పని చేయడం వలన అందరికీ కొంత వ్యాయామం చేయడంతో పాటు సూర్యకిరణాలు తగిలి విటమిన్ డి ఉచితంగా లభించి ఆరోగ్యంగా ఉంటామన్నారు.
మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనం నివసించే మచిలీపట్నం నగరం కూడా ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, వసుధ జీవవైవేద్య బృందం నాయకులు మణిరత్నం, వారి కార్యకర్తలు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షన్, స్వర్ణ వార్డు సిబ్బంది పాల్గొన్నారు.

