సాంఘిక సంక్షేమ శాఖలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారిగా షేక్ షాహిద్ బాబు కి అవార్డు
మచిలీపట్నం:
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్, ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో, ఆ విజయానికి కృషి చేసిన షేక్ షాహిద్ బాబు కి ఈ అవార్డు దక్కడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా కృష్ణా జిల్లాకి సంబంధించి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు షాహిద్ బాబు కి ప్రదానం చేశారు.
ఈ విద్యా సంవత్సరం సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రగతిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ కిందిస్థాయి అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు విశేష కృషి చేశారు. అంతేగాక తరచూ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లను పర్యవేక్షించి విద్యార్థులకు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి అనేది ఉద్భోదించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణా తరగతుల నిర్వహణకు కృషి చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వార్డెన్లకు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులకి, సోషల్ వెల్ఫేర్ అధికారులకి, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల విద్యా ప్రగతిని తెలుసుకుంటూ వారి విద్యా పురోభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరి కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఉత్తమ అధికారిగా అవార్డు ప్రకటించడం పట్ల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ వార్డెన్లు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, సోషల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, సాంఘిక సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ లావణ్య వేణి , ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ పలువురు ఉన్నతాధికారులు షేక్ షాహిద్ బాబును అభినందించి, వారు చేసిన సేవల్ని కొనియాడారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, ఉత్తమ ఫలితాల సాధనకు షాహిద్ బాబు చేసిన కృషిని ప్రశంసించారు.

