ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ కుట్ర!!!
జనసేన భేటీలో పవన్ మాటలు ఆశ్చర్యకరం
టీడీపీ వేధింపులపై మూడేళ్ల తర్వాత స్పందిస్తారా ?
కూటమి కట్టే ప్లాన్ కు ఇప్పటం సభలోనే బీజం
ఒంటరి పోటీపై ఇప్పుడు పవన్ పసలేని మాటలు
తేల్చేసిన పేర్ని వెంకట్రామయ్య (నాని)
మచిలీపట్నం :
ఆర్టీసీని నడిపించడం చేతకాక విద్యుత్ బస్సులు, నిర్వహణా నష్టాల్ని కారణంగా చూపుతూ ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ఆదివారం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన కూటమి సర్కార్ ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 100 విద్యుత్ బస్సుల్ని తీసుకుని, ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించి మరీ విజయవంతంగా తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 750 బస్సుల్ని కొని, నడపలేక ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆక్షేపించారు.
ప్రెస్ మీట్లో పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంకేమన్నారంటే..
చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు ఆర్టీసీకి కష్టాలే.
చంద్రబాబు తన పాలనలో 24 నెలలు నిండకుండానే 3.50 లక్షల కోట్లకుపైగా అప్పుల్ని రాష్ట్ర ప్రజలపై పెట్టారు. రాబోయే మూడేళ్లలో ఇక రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. అప్పుల్లో, నేరాల్లో, నిరుద్యోగంలో.. ఇలా ఎన్నో విషయాల్లో దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీ మొదటి స్ధానంలో ఉన్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగైదు ర్యాంకుల నుంచి 26వ ర్యాంకులకు దిగజారిపోయాం. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ, కారణాన్ని రాష్ట్రంలో మహిళలపై నెట్టేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చాం కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తామంటున్నారు. కేంద్రం ఇస్తున్న 750 విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ భరించగలదా, ప్రజలు భరించగలరా చెప్పాలి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంటుంది. 2004లో రాజశేఖర్ రెడ్డి కాకుండా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆర్టీసీని అప్పుడే అమ్మేసేవారు. రాజశేఖర్ రెడ్డి గారు గెలవడం వల్లే 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014లో చంద్రబాబు గెలవగానే జయము జయము చంద్రన్న అంటూ ఆర్టీసీ బస్సుల్ని పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిప్పారు. ఆర్టీసీ ఏదో టీడీపీ సొత్తులాగా, నారా ఖర్జూర నాయుడు సంపాదించి ఇచ్చినట్లు చంద్రబాబు వాడేస్తుంటారు. ఆర్టీసీకి నయా పైసా మాత్రం జమ చేయడు.
55 వేల మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్
2018లో ఆర్టీసీలో 55 వేల మంది కార్మికులు సమావేశమై చంద్రబాబు మోయలేనంత దండ వేసి తమను ప్రభుత్వంలో కలపమని అడిగితే అలాంటివేమీ అడగొద్దని చెప్పేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక 55 వేల ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఆర్టీసీ నిర్వహణా అప్పులు అక్షరాలా రూ.6300 కోట్లు. చంద్రబాబు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిపోయిన ఆస్తి ఇది. మరొక రూ.3351 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. బ్యాంక్ రుణం ఇస్తేనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్ధితి ఉండేది. ఇలాంటి పరిస్ధితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పట్లో పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే తమ ఆర్టీసీ ఉద్యోగుల్ని కలపమంటే.. ఏపీలో ఏంటి అయ్యేది మన్ను అంటూ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది చేసి చూపించారు.
చంద్రబాబు 9 వేల కోట్ల ఆర్టీసీ అప్పుల్ని జగన్ 2 వేల కోట్లకు తగ్గించలేదా ?
జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయే నాటికి ఆర్టీసీ అప్పుల భారం రూ.2 వేల నుంచి రూ.2500 కోట్లకు తగ్గింది. బ్యాంకులకు ఉన్న 9 వేల కోట్ల అప్పును 2 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ గొప్పతనం ఎవరిదో ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు తన మనుషులతో 2 కోట్ల 10 లక్షల ఖరీదు చేసే బస్సులో కేంద్రం సబ్సిడీ పోను కోటీ 70 లక్షలు అవుతుంది, దీన్ని ఆర్టీసీ భరించలేదని చెప్పిస్తున్నారు. కేంద్రం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజా రవాణాలో విద్యుత్ బస్సులు కొంటే రూ.40 లక్షలు ఇస్తామంటోంది. 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క విద్యుత్ బస్సు కొనలేదు. కేంద్రంలో అప్పుడూ ఎన్టీఏతో కలిసి ఉన్న చంద్రబాబు ఒక్క బస్సు కొనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100 బస్సుల్ని ఇలా కొనుగోలుచేసింది. ఇందులో 50 బస్సుల్ని తిరుమల కొండపైకి వెళ్లేందుకు కేటాయించింది. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు మిగతా బస్సులు కేటాయించింది. ఆర్టీసీ డ్రైవర్లకు జగన్మోహన్ రెడ్డి శిక్షణ ఇప్పించి మరీ నడిపించారు. ఇవాళ్టీకీ 100 బస్సులు తిరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మనం విద్యుత్ బస్సులు కొనలేం, అందుకే ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటోంది. ఎందుకు కొనలేరో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు వదిలివెళ్లింది 2 వేల కోట్ల అప్పులే కదా. ఆ తర్వాత అప్పు తీరిపోతే ఆర్టీసీకి బ్యాంకులు తిరిగి అప్పు ఎందుకు ఇవ్వవు ? ఆర్టీసీని సర్వనాశనం చేశారు కాబట్టే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీని నడపలేకపోతున్నట్లు ఇప్పుడు చెప్తున్నారు. ఆర్టీసీకి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి ? ఆర్టీసీ బస్సుల్లో కొట్టే జీరో టికెట్లు ప్రభుత్వానికి క్లెయిమ్ చేసుకుంటే డబ్బులు ఇవ్వాల్సి కదా. అలా ఇవ్వకపోవడం వల్లే ఈ దుస్దితి ఎదురవుతోంది.
టీడీపీ వేధింపులపై పవన్ మౌనం ఎందుకో ?
జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల చేతుల్లో చాలా వేధింపులకు గురవుతున్నారు, బాధలు పడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అన్నీ ఆయనకు తెలుసంటున్నారు. మేం భరించడానికీ ఓ హద్దు ఉంటుందని చంద్రబాబుకు పవన్ చెప్తున్నారు. హద్దు దాటితే సహించలేనంటున్నారు. ఏం సహించలేరో పవన్ చెప్పాలి. బందరులో లంచం ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూలగొడితే , ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర ను ప్రశ్నించారా ? ఎంత మంది కార్యకర్తల్ని కొడుతున్నా, ఇంటికెళ్లి కాళ్లు పట్టించుకుంటున్నా స్పందించడం లేదు. అదంతా మీ ఇష్టం. నాలుగు గోడల మధ్య తలుపులేసుకుని ఇవన్నీ చేసుకుంటే ఇబ్బంది లేదు. ప్రజలకు ఇవన్నీ చూపిస్తున్నారు కాబట్టే చర్చ జరుగుతోంది. జనసేన కార్యకర్తల బాధలు, వేధింపులు పగ వాడికి కూడా రాకూడదు. ఏమీ తెలియనట్లు పవన్ నేను ఊరుకోను అంటున్నారు. మిగిలిన మూడేళ్ల తర్వాత స్పందిస్తారా ? చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ .. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ ను సీజ్ చేస్తే దాన్ని నాలుగైదు రోజులు మాత్రమే ఆపగలిగామని బాధపడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఉండాల్సిందని తనకు కార్యకర్తలు మెసేజ్ లు పెడుతున్నారని పవన్ చెప్పుకుంటున్నారు, అలాగే చంద్రబాబును జైల్లో పరామర్శించాక రోడ్ మ్యాప్ కనబడిందని, ఆప్పుడు కూటమిగా వెళ్తామని చెప్పామంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇప్పటం సభలో .. కూటమిగా వెళ్లి వైఎస్సార్సీపీని ఓడిస్తామని చెప్పిన మాటలు గుర్తులేవా ? అని పేర్ని వెంకట్రామయ్య (నాని) చురకలు అంటించారు.

