రామాలయం పునర్నిర్మాణానికి గ్రామస్తుల పోరాటం
మచిలీపట్నం:
రామాలయం నిర్మాణంలో ఉపయోగించడం కోసం ఉంచిన గ్రానైట్ రాళ్లను మే 5, 2026 న జి యేసు అను వ్యక్తి ఉద్దేశ్య పూర్వకంగా పగలకొట్టాడని ఆరోపిస్తూ ఆలయ కమిటీ సభ్యలు వంశీ, సాయి కృష్ణ కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ఘటనకు సంబంధించి సీసీఫుటేజ్ కూడా సమర్పించారు, కానీ సదరు ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దాంతో ఫిర్యాదులో పేర్కొన్న నిందితునిపై కేసు నమోదు చేయవలసిందిగా కోరుతూ సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పి జి ఆర్ ఎస్ హాలులో ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే … కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో 1916 లో దాత దాసరి నాగడు సహకారంతో గ్రామస్తులు రామాలయం నిర్మించారు. ఆలయ నిర్మాణం జరిగి 90సంవత్సరాలు పైబడటంతో ఆలయం జీర్ణమైంది. శిధిలమైన ఆలయాన్ని పునర్నిర్మించడానికి 2009లో దాతల సహకారంతో భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ స్థానికంగా ఉన్న కొందరు అన్య మతస్తులు ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించడానికి వీలు లేదని, నిర్మిస్తే మత విద్వేషాలు ప్రబలే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ ప్రాంతంలో ఆలయం 1916 నుంచి ఉన్నట్లుగా ఆధారాలు ఉండటంతో ఆలయ నిర్మాణానికి సిఆర్డీఏ అనుమతులు మంజూరు చేసింది. ఆలయ పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులు మార్చి 2025లో 5గురు సభ్యులతో కోదండ రామ భక్త సమాజం పేరుతొ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆలయం నిర్మాణ దశలో ఉంది. స్థానిక గ్రామస్తులు కొందరు ఆలయ పునర్నిర్మాణానికి ఆటంకాలు కల్పిస్తున్నట్లుగా కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

