MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

తుఫాను ప్రభావిత గ్రామాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థుల సేవా కార్యక్రమాలు

  • October 31, 2026
  • 1 min read
తుఫాను ప్రభావిత గ్రామాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థుల సేవా కార్యక్రమాలు

మచిలీపట్నం :

సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నం పరిసర గ్రామాల్లో ‘అర్నాబ్’ తుఫాను తీవ్ర అలజడి సృష్టించింది. ఈ తుఫాను దాటికి దెబ్బతిన్న తీరప్రాంత గ్రామాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు అండగా నిలిచారు. వర్సిటీ ఉపకులపతి (విసి) ఆచార్య కూన రాంజీ ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయ నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ల ఆధ్వర్యంలో మచిలీపట్నం సమీపంలోని చిన్నాపురం, గుండుపాలెం, ఆర్. గొల్లపాలెం, కోన గ్రామాల్లో విద్యార్థి వాలంటీర్లు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తుఫాను అనంతర వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా వాలంటీర్లు గ్రామీణ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈదురు గాలులకు రోడ్లపై కూలిపోయి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న చెట్లను, కొమ్మలను తొలగించి మార్గాలను సుగమం చేశారు. అంతేకాకుండా, గ్రామస్తులను కలిసి తుఫాను వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులతో మాట్లాడుతూ.. సర్వేలో తమ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలను వెంటనే సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సేవా కార్యక్రమాలు వర్సిటీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఆర్. దుర్గాప్రసాద్, డాక్టర్ పి. గోపి, డి. శాంతి కృప, కె. కవిత, డాక్టర్ ఎ. శేషారెడ్డి, ఎన్. రంగశ్రీల పర్యవేక్షణలో విజయవంతంగా సాగాయి. ఆపద సమయంలో స్పందించి సేవ చేసిన కేయూ విద్యార్థులను, అధ్యాపకులను పలువురు గ్రామస్తులు అభినందించారు.

About Author

SSN