పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ప్రాజెక్టుకు సర్వం సిద్ధం… ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం:
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకార్థం మచిలీపట్నంలో భారీ స్థాయిలో మెమోరియల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పట్టాభి సీతారామయ్య పేరిట మెమోరియల్ హాల్, ఆడిటోరియం, లైబ్రరీ, నాలెడ్జ్ పార్క్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ద్వారా ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ జరుగుతోందన్నారు. మొదటి దశలో సుమారు రూ.6.5 కోట్ల వ్యయంతో స్థల అభివృద్ధి, కాంపౌండ్ వాల్, పట్టాభి సీతారామయ్య విగ్రహ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహ రూపకల్పనపై కుటుంబ సభ్యులు, నిపుణులతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అదే ప్రాంగణంలో ఆధునిక లైబ్రరీ, మ్యూజియం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్లు, అధ్యయన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువతకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టును రూపుదిద్దుతున్నామని చెప్పారు.
రెండో దశలో ఆధునిక ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశముందని అన్నారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైందన్నారు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో భూమి కేటాయింపుకు ఆమోదం లభించిందని తెలిపారు. త్వరలో బ్యాంకింగ్ శాఖ ఉన్నతాధికారులను ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
భవనం నిర్మాణం పూర్తైన అనంతరం ప్రారంభోత్సవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యే అవకాశముందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ఆమె ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతుగా కేంద్ర స్థాయిలో చర్చించినట్లు పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

