MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డీపీఓ ఎం. ధనలక్ష్మి క్షేత్రస్థాయి పరిశీలన: సహాయక చర్యలు, పారిశుధ్య పనులు వేగవంతం

  • October 28, 2026
  • 1 min read
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డీపీఓ ఎం. ధనలక్ష్మి క్షేత్రస్థాయి పరిశీలన: సహాయక చర్యలు, పారిశుధ్య పనులు వేగవంతం

మచిలీపట్నం:

‘అర్నబ్’ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు, పారిశుధ్య నిర్వహణ, పునరావాస ఏర్పాట్లను పంచాయతీ రాజ్ యంత్రాంగం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఎం. ధనలక్ష్మి కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలలో బుధవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.

నేలకొరిగిన చెట్ల తొలగింపు – రాకపోకల పునరుద్ధరణ

ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ, తుఫాను ధాటికి గ్రామాల్లోనూ, రహదారులపై నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించి రవాణా సౌకర్యానికి అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. సహాయక, పునరుద్ధరణ చర్యల్లో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

పునరావాస కేంద్రాల తనిఖీ

ప్రభావ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను డీపీఓ పరిశీలించి, బాధితులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. కేంద్రాల్లో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.

నీటి నిల్వల నివారణ, దోమల అరికట్టడం

గ్రామాల్లో నిలిచిన వర్షపు నీటిని తక్షణమే మళ్లించాలని, డ్రైనేజీ కాలువల్లో పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేసి, మురుగు నీటి నిల్వలను నివారించడం ద్వారా దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మౌలిక సదుపాయాల మరమ్మతులు

దెబ్బతిన్న వీధి దీపాలు, రహదారులు, ప్రజా ఆస్తులను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, మంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వకూడదని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా అప్రమత్తంగా వ్యవహరించాలని డీపీఓ ధనలక్ష్మి ఆదేశించారు.

About Author

SSN